భారత క్రికెటర్ భార్యలు అంటే గ్యాలరీల్లో కనిపించడం తప్ప.. బ్యాట్ పట్టిన సందర్భాలు చాలాతక్కువ. ఏదో స్టువర్ట్ బిన్నీ భార్యలా కామెంటేటర్ అవతారం ఎత్తితే గానీ బ్యాట్ చేత పట్టరు. కానీ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాభా జడేజా అందుకు విభిన్నం. బ్యాట్ చేత పట్టిన ఆమె బౌండరీల వర్షం కురిపించారు.
ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క. ఇన్నాళ్లు స్టార్ క్రికెటర్ భార్యలు అంటే మైదానంలోకి వచ్చి చప్పట్లు మాత్రమే కొట్టేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. భర్తలకు ఏమాత్రం తీసిపోకుండా వారి సతీమణులు బ్యాట్ చేత పట్టి ధనాధన్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపిస్తున్నారు. తాజాగా భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాభా జడేజా అలానే అలరించారు. గుజరాత్ MLA Premier League 2023లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అందకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
రైట్ హ్యాండెడ్ బ్యాటర్ అయిన రివాభా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది. పలు బంతులను బౌండరీకి తరలించింది. అంతేకాదు ఆమె ఫీల్డింగ్‌లోనూ ఔరా అనిపించింది. బంతి బౌండరీకి వెళ్లకుండా బాగానే ఫీల్డింగ్ చేసింది. ఆమె బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆమెపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘జడేజాకు ఏమాత్రం తీసిపోరు..’ అంటూ ఆమెను పొగుడుతున్నారు. ఇదిలావుంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీచేసిన రివాభా జడేజా ఎమ్మెల్యేగా గెలుపొందింది. జామ్‌నగర్ నార్త్ నుంచి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థిపై 60 వేలకుపైగా భారీ మెజార్టీతో విజయం సాధించింది.
ఇక రవీంద్ర జడేజా ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో అంచనాలకు మించి రాణిస్తోంది. గతేడాది పేలవ ఆటతీరుతో నిరాశపరిచినా.. ఈ సీజన్ లో ఆటగాళ్లందరూ అత్యుత్తమ ఆట తీరు కనబరుస్తున్నారు. జడేజా సైతం బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు సీఎస్కే 7 మ్యాచులు ఆడగా, ఐదింట విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉంది.