యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రనౌట్ తీరుపై వివాదం చెలరేగింది. అసలు రనౌట్ విషయంలో మెరిల్ బోన్ క్రికెట్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ఇప్పటికే యాషెస్ సిరీస్ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ తో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 12 పరుగుల స్వల్ప ఆదిక్యం దక్కించుకుంది. అయితే ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రనౌట్ గా పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో అంపైర్ తిరిగి అతడిని బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించడంపై వివాదం చెలరేగింది. అసలేం జరిగిందంటే.. ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్ సహచరులంతా వెనుదిరిగిన సమయంలో స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు. అదే సమయంలో మార్క్ వుడ్ బౌలింగ్ లో స్మిత్ రెండో రన్ తీసే ప్రయత్నం చేయగా.. సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ జార్జ్ ఎల్హెమ్ బంతిని వికెట్ కీపర్ కు త్రో చేశాడు. క్షణాల్లోనే బెయిర్ స్టో వికెట్లు గిరాటేశాడు. దీంతో ఫుల్ లెంగ్త్ డైవ్ చేసినా ఫలితం దక్కలేదని స్మిత్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
కానీ రీప్లేను పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ నితిన్ మీనన్.. స్మిత్ ను నాటౌట్ గా పరిగణించి తిరిగి బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఇచ్చాడు. దీంతో సంతోషంగా వెనక్కి వచ్చిన స్మిత్.. జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. ఆ సమయంలో 44 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ చివరకు 71 పరుుగులు చేసి పెవిలయన్ కు చేరాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యం సాధించ గలిగింది. అయితే ఇంగ్లండ్ ప్లేయర్లంతా స్మిత్ ఔటయ్యాడని సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అంపైర్ నిర్ణయం వారిని విస్మయానికి గురిచేసింది.
జార్జ్ ఎల్హెమ్ వేసిన త్రోను బెయిర్ స్టో సరైన సమయంలోనే వికెట్లను తాకించినా.. బెయిల్స్ పూర్తి గా పడక పోవడంతో అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వికెట్ల పై నుంచి బెయిల్స్ పూర్తిగా పడిపోయే సమయానికి స్మిత్ బ్యాట్ పాపింగ్ క్రీజ్ గీత దాటడంతో అతడిని నాటౌట్ గా ప్రకటించాడు. దీనిపై స్పందించిన భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అంపైర్ నిర్ణయాన్ని మెచ్చుకున్నాడు. అంపైర్ కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
మరోవైపు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందిస్తూ.. ‘నాకు రనౌట్ రూల్స్ నిజంగా తెలియదు. అది సరైన నిర్ణయమో లేదో కూడా తెలియదు. నాకైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్ కు ప్రయోజనం లభించింది అనిపిస్తోంది. మొదట రిప్లే చూసినప్పుడు అది కచ్చితంగా ఔట్ అనే అనుకున్నాం. కానీ పలుమార్లు పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు’ అని వెల్లడించాడు.
What’s with the Ashes and substitute fielders. #ashes2023 #ashes2005 #garypratt #georgeeahlam
Have to applaud Nitin Menon for making the right decision 👏👏
— Ashwin 🇮🇳 (@ashwinravi99) July 28, 2023