వన్డే వరల్డ్‌కప్‌కు సమయం దగ్గరపడుతోంది. అయితే మిగిలిన జట్ల పరిస్థితి ఎలా ఉన్నా భారత టీమ్‌ను మాత్రం గాయాల సమస్య ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ఇంతకీ ఆయనేం అన్నాడంటే..!
వన్డే ప్రపంచ కప్ సమీపిస్తోంది. ఈ మెగా ఈవెంట్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో అన్ని జట్లు ఈ టోర్నీని లక్ష్యంగా పెట్టుకుని సన్నాహాలు మొదలుపెట్టాయి. తమ తుది కూర్పును సిద్ధం చేసుకోవడంపై శ్రద్ధ పెట్టాయి. ఏయే ప్లేయర్లను తీసుకోవాలి అనే దానిపై ప్లాన్‌ను రచిస్తున్నాయి. తుది జట్టు కోసం పరిగణనలోకి తీసుకునే ప్లేయర్లను పరీక్షిస్తున్నాయి. ఈ రెండు, మూడు నెలల్లో జరిగే టోర్నీల్లో వాళ్లు ఆడే దాన్ని బట్టి ఫైనల్ ఎలెవన్‌ను ఫిక్స్ చేసుకుంటాయని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. టీమిండియా పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగా ఉంది. కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడుతుండటం భారత శిబిరాన్ని కలవర పెడుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎప్పటికి కోలుకుంటాడనే దానిపై క్లారిటీ లేదు.
గాయాల కారణంగానే పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యారు. వీళ్లు అందుబాటులోకి వచ్చేందుకు కనీసం నాలుగైదు నెలల సమయం పట్టొచ్చని అంటున్నారు. మరో వారం రోజుల్లో ఐపీఎల్ మొదలుకానుంది. ఈ మెగా టోర్నీలో భారత స్టార్లు అందరూ ఆడనున్నారు. ఈ తరుణంలో వీళ్లు తమ ఫిట్నెస్ను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరైనా గాయపడితే జాతీయ జట్టుకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి బీసీసీఐకి కీలక సూచన చేశాడు. వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కీలక ప్లేయర్లపై మ్యాచ్ భారాన్ని తగ్గించేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో బీసీసీఐ, ఆటగాళ్లు మాట్లాడాలని చెప్పాడు. అవసరమైతే భారత ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడకూడదని రవిశాస్త్రి సూచించాడు.
‘కీలక ఆటగాళ్లు గాయాల బారినపడుతుండటం భారత జట్టుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మేం క్రికెట్ ఆడిన సమయంలో ఇన్ని సదుపాయాలు లేవు. అయినా, మేం 8 నుంచి 10 సంవత్సరాలు సులభంగా ఆడటం మీరందరూ చూశారు. చాలా మంది ఏడాదిలో 8 నుంచి 10 నెలల పాటు క్రికెట్ ఆడేవారు. ప్రస్తుతం చూసుకుంటే.. అప్పటి కంటే ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌ల్లో ప్లేయర్లు భాగం కావడంతో వారి విశ్రాంతి తీసుకునే సమయం తగ్గుతోంది. బీసీసీఐ, ప్లేయర్లు కూర్చొని దీని గురించి చర్చించుకోవాలి. ఆటగాళ్లకు క్రికెట్ చాలా అవసరం. అదే సమయంలో విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఆటగాళ్లు అవసరమైతే ఐపీఎల్‌లో ఆడకండి. ఈ విషయంలో బీసీసీఐ బాధ్యత తీసుకుని.. ‘ఈ ప్లేయర్లు మాకు కావాలి. టీమిండియాకు వీరి సేవలు అవసరం. వారు ఈ మ్యాచ్‌లు (ఐపీఎల్) ఆడకపోతే బాగుంటుంది’ అని ఫ్రాంచైజీలకు చెప్పాలి’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
IPLలో ఆడొద్దు: రవిశాస్త్రి
ఆటగాళ్లకు సరైన విశ్రాంతి దొరకడం లేదని, భారత కీలక ఆటగాళ్లు అవసరమైతే ఐపీఎల్‌లో ఆడొద్దని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. బీసీసీఐ బాధ్యత తీసుకుని, ఫ్రాంచైజీలతో మాట్లాడాలని పేర్కొన్నాడు. #RaviShastri #IPL2023 #BCCI #WorldCup2023 #SumanTV— SumanTV (@SumanTvOfficial) March 24, 2023