సాధారణంగా ఫామ్ లో లేని ఆటగాడిని జట్టు నుంచి తొలగించమని క్రికెట్ దిగ్గజాలు.. సెలెక్షన్ కమిటీకి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే అనుభవాన్ని బట్టి, ఆటగాణ్ణి బట్టి కొందరిని అప్పుడప్పుడు జట్టులో కొనసాగించాల్సి వస్తుంది. కానీ సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాణ్ణి పక్కన పెట్టాలి అని ఏ దిగ్గజ ఆటగాడు కూడా చెప్పడు. అయితే ఇక్కడ మాత్రం సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీని జట్టు నుంచి తొలగించాలని టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ నుంచి కోహ్లీని తప్పించాలని సూచించాడు. దానికి ఓ ముఖ్యమైన కారణం కూడా ఉందని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ.. నెల రోజుల ముందు ఫామ్ లేక ఇంటా.. బయట సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నాడు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కోహ్లీ సెంచరీ చేసి తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు విరాట్. వరుసగా సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ.. రికార్డులు కొల్లగొట్టాడు. మరి ఇలా రాణిస్తున్న విరాట్ కోహ్లీని న్యూజిలాండ్ తో జరిగే మూడో వన్డే నుంచి తొలగించాలని సూచించాడు రవిశాస్త్రి. దానికి ఓ బలమైన కారణాన్ని కూడా వెల్లడించాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ఇది కాదనలేని వాస్తవం. అయితే అతడు టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలం అవుతూ.. వస్తున్నాడని రవిశాస్త్రి పేర్కొన్నాడు. దీనికి నిదర్శనం అతడు టెస్టుల్లో సెంచరీ చేసి రెండు సంవత్సరాలు కావస్తుండటమే.
ఈ క్రమంలోనే 2019లో కోహ్లీ తన చివరి టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు విరాట్ టెస్టుల్లో సెంచరీ కొట్టలేదు. ఇదే విషయాన్ని తాజాగా గుర్తు చేశాడు రవిశాస్త్రి. వచ్చే నెలలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ లో పర్యటించనుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ ప్రపంచ టెస్ట్ సిరీస్ ఛాంపియన్ కు కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే విరాట్ ను కివీస్ తో జరిగే చివరి వన్డే నుంచి తప్పించి రంజీల్లో ఆడించాలని రవిశాస్త్రి సూచించాడు. గత కొన్ని నెలల నుంచి టెస్టుల్లో విరాట్ రాణించడం లేదు. దాంతో కీలకమైన ఆసిస్ టెస్ట్ సిరీస్ కు ముందు రంజీ ట్రోఫీలో ఆడితే అతడికి ప్రాక్టీస్ అవుతుందని ఈ సందర్భంగా రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అయితే స్టార్ క్రికెటర్లు ఇండియాకు సుదీర్ఘంగా ఆడిన తర్వాత రంజీలు ఆడటానికి ఇష్టపడరని రవిశాస్త్రి తెలిపాడు. అయితే 25 సంవత్సరాల క్రితం సచిన్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడని ఈ సందర్భంగా రవిశాస్త్రి గుర్తు చేశాడు.
1998లో ఆస్ట్రేలియాతో జరిగిన అన్ని ఫార్మాట్స్ లో 1000 పరుగులు చేశాడు సచిన్. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ప్రస్తుతం కోహ్లీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించే అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. అయితే రవిశాస్త్రి వ్యాఖ్యలపై రకరకాలుగా స్పందిస్తున్నారు క్రికెట్ అభిమానులు. విరాట్ కోహ్లీ ఇప్పుడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అతడిని రంజీల్లో ఆడమని ఎందుకు చెబుతున్నారు.. ఇది అతడి గౌరవాన్ని తగ్గించినట్లే అని కొందరు కామెంట్స్ చేస్తే.. అవును నిజమే రవిశాస్త్రి చెప్పింది అక్షరాల సత్యం అని మరికొందరు అంటున్నారు. మరి రవిశాస్త్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.