టీమిడియా కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం సోమవారంతో ముగిసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత్- నమీబియా మ్యాచే కోచ్ గా రవిశాస్త్రికి ఆఖరి మ్యాచ్. తనను కోచ్ గా నియమించిన అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ కు రవిశాస్త్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. తనపై నమ్మకంతో జట్టు బాధ్యతలు అప్పజెప్పారని. 2014లో ఇంగ్లాండ్ పర్యటనలో ఘోర వైఫల్యం తర్వాత తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పారని గుర్తుచేసుకున్నాడు. 2014లో టీమిండియా డైరెక్టర్ గా అపాయింట్ అయిన రవిశాస్త్రి 2017లో కోచ్ గా మారాడు. 2019లో మరోసారి రవిశాస్త్రి పదవీకాలం పొడిగించారు.
‘ఇన్నేళ్లు టీమిండియా కోచ్ గా కొనసాగడం చాలా గొప్ప విషయం. కోచ్ గా డ్రెస్సింగ్ రూమ్ లో ఇవే నాకు చివరి క్షణాలు. కోచ్ గా నాకు ఈ మధుర అనుభవాలు, అనుభూతులు పొందే అవకాశం కల్పించిన బీసీసీఐకి ధన్యవాదాలు. కోచ్ గా నేను చేయగలిగినదంతా చేశాననే భావిస్తున్నాను. నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పిన శ్రీనివాసన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా’ అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు.