యూఏఈ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను.. రద్దు చేసుకున్నట్లు తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘన్ లో మహిళలు, పిల్లల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా తాలిబన్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న క్రమంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఈ నిర్ణయం క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఇక ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై స్పందించాడు ఆఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్. మీరు మాతో క్రికెట్ ఆడకపోతే.. ప్రస్తుతం నేను ఆడుతున్న బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పుకుంటానని షాకింగ్ కామెంట్స్ చేశాడు రషీద్ ఖాన్. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలపై జరుగుతున్న దాడులకు, వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా నిర్ణయం తీసుకుంటున్నందుకు.. మీతో వన్డే సిరీస్ ను రద్దు చేసుకుంటున్నాము అని ఆస్ట్రేలియా ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుతో సహా.. క్రీడా ప్రపంచం మెుత్తం ఆశ్చర్యపోయింది. ఇక ఆసిస్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై రషీద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియాలో ఈ విధంగా రాసుకొచ్చాడు. “మాతో ఆడాల్సిన వన్డే సిరీస్ ను రద్దు చేసుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చేసిన ప్రకటన నన్ను ఎంతగానో బాధించింది. ప్రస్తుతం మా దేశాన్ని ప్రపంచ పటంపై నిలబెట్టేందుకు మాకున్న ఏకైక ఆశాకిరణం ఒక్క క్రికెట్ మాత్రమే! ఇప్పుడు మీరు తీసుకున్న ఈ నిర్ణయం మా దేశాన్ని వెనక్కిపోయేలా చేస్తుంది. ఇక నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవం” అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.
దాంతో పాటుగానే ఒకవేళ ఆసిస్ కు మాతో ఆడటానికి ఇబ్బంది అనిపిస్తే.. నేను కూడా బిగ్ బాష్ లీగ్ లో ఆడాలా? లేదా? అనే దానిపై కాస్త కఠినంగానే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని రషీద్ ఖాన్ ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు. అంటే పరోక్షంగా మీరు మాతో ఆడకపోతే.. నేను బిగ్ బాష్ లీగ్ ఆడను అని చెప్పాడన్నమాట. ప్రస్తుతం రషీద్ బిగ్ బాష్ లీగ్ లో ఆడిలైడ్ స్ట్రైకర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ విషయంపై ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు సైతం విచారం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని మేము ఊహించలేదు. కచ్చితంగా ఇది మా దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని బోర్డు పేర్కొంది. మరి రషీద్ ఖాన్ తన దేశం కోసం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Cricket! The only hope for the country.
Keep politics out of it. @CricketAus @BBL @ACBofficials ♥️ 🇦🇫 ♥️ pic.twitter.com/ZPpvOBetPJ— Rashid Khan (@rashidkhan_19) January 12, 2023