రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శకునం కలసి రావడం లేదు. ఐపీఎల్ ఆరంభానికి ముంగిట ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తాకింది. ఇద్దరు కీలక ప్లేయర్లు ఆర్సీబీకి దూరమయ్యారని సమాచారం.
ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందే జట్లకు వెన్నెలో వణుకు పుడుతోంది. గాయాలబెడదతో కీలక ప్లేయర్లు సీజన్‌కు దూరమవుతున్నారు. దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలను ఈ సమస్య వెంటాడుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా గాయాలబెడద తప్పడం లేదు. ప్లేయర్ల ఫిట్నెస్ ఆర్సీబీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే విల్ జాక్స్ టోర్నీకి దూరమవ్వగా.. స్పీడ్‌స్టర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరో ఆసీస్ ఆటగాడు, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదు. లంక స్పిన్నర్ హసరంగ కూడా ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నాడని తెలుస్తోంది. మరో బ్యాటర్ రజత్ పాటిదార్ కూడా ఇదే బాటలో నడవనున్నాడు.
రజత్ పాటిదార్ కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ రిహాబిలిటేషన్‌లో పాటిదార్ ఉన్నాడు. కనీసం మూడు వారాల విశ్రాంతి అతడికి అవసరమని నిపుణులు సూచించారని తెలుస్తోంది. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాతే ఐపీఎల్ రెండో భాగంలో రజత్ పాటిదార్ అందుబాటులో ఉంటాడో లేదో తేలనుంది. ఆర్సీబీ టీమ్ క్యాంప్‌లో చేరడానికి ముందే గాయం కావడంతో.. రజత్‌కు ఎన్సీఏ క్లియరెన్స్ తప్పనిసరి కానుంది. రజత్ పాటిదార్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో బ్యాటింగ్ కాంబినేషన్ విషయంలో ఆర్సీబీ పునరాలోచించాల్సి ఉంటుంది.
ఆర్సీబీని మరో ఇద్దరు ప్లేయర్ల గాయాలు భయపెడుతున్నాయి. అందులో ఒకరు పేసర్ జోష్ హేజల్‌వుడ్ కాగా.. మరొకరు గ్లెన్ మ్యాక్స్‌వెల్. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హేజల్‌వుడ్ సేవలు అందుబాటులో ఉండటం సందేహమే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్‌కు వచ్చిన అతడు.. ఒక్క టెస్టులో కూడా ఆడకుండా స్వదేశానికి వెళ్లిపోయాడు. జూన్‌లో టీమిండియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు ఆ తదుపరి ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ ఉన్నాయి. దీంతో హేజల్‌వుడ్ రికవరీని ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్మెంట్ నిశితంగా గమనిస్తోంది. ఇక, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ శిబిరంలో జాయిన్ అయినా.. అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ విషయాన్ని స్వయంగా మ్యాక్స్‌వెల్ చెప్పాడు. మరి.. గాయాలబెడదతో ఇబ్బంది పడుతున్న ఆర్సీబీ ఈ సీజన్లో ఎలా రాణిస్తుందో చూడాలి.
RCB batter Rajat Patidar likely to miss first half of IPL 2023 due to heel injury
Read @ANI Story | https://t.co/Peo1MXgHru#IPL2023 #RCB #RajatPatidar #cricket pic.twitter.com/LNxzU5t2fK
— ANI Digital (@ani_digital) March 26, 2023