జింబాబ్వేతో శనివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జింబాబ్వే జట్టుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. సిరీస్ సొంతం కావడంతో బెంచ్ ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చేందుకు టీమిండియా ప్లాన్ చేస్తోంది. సిరీస్ ముగింపు మ్యాచ్ సందర్భంగా జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆఖరి వన్డేకు ముందు జరిగే మ్యాచ్‌ల విషయంలో జట్టు ఎంపికలో పలు సూచనలను ఇచ్చారు. బ్యాటింగ్ విషయంలో మేనేజ్‌మెంట్ ఆఖరి వన్డేలో ఎలాంటి మార్పులు చేపడుతుందో తనకు తెలియదని, అయితే షాబాజ్ అహ్మద్ చివరి వన్డే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని ఊతప్ప అన్నారు.
రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి వీరిరువురూ కొంతకాలంగా బెంచ్ మీదే ఉన్నారని, వారికి చివరి వన్డేలో కూడా అవకాశం రాకపోతే అది అన్యాయమే అవుతుందని అన్నారు. ఇక కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన ఇషాన్ కిషన్‌ను తీసేయడం కూడా కరెక్ట్ కాదని అన్నారు. తొలి రెండు మ్యాచుల్లో ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లకు మేనేజ్‌మెంట్ విశ్రాంతినివ్వచ్చునని ఊతప్ప పేర్కొన్నారు. చివరి మ్యాచ్‌కి దీపక్ చాహర్ తిరిగి వస్తారని, అవేష్ ఖాన్, శార్దూల్‌లు కూడా ఈ మ్యాచ్‌లో ఆడతారని పేర్కొన్నారు. టీమ్‌లో ఆటగాళ్ళు ఎప్పటికప్పుడు రీఫ్రెష్‌గా ఉండేలా ఫాస్ట్ బౌలర్లను రొటేషన్ పాలసీలో ఆడించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఊతప్ప. ఏది ఏమైనా గానీ రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠిలకి తుది జట్టులో అవకాశమిస్తే బాగుంటుందని, లేకపోతే అన్యాయం చేసినట్టే అవుతందని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరి రాబిన్ ఊతప్ప చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.