టీ20 వరల్డ్ కప్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్కాట్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. అంతకు ముందు 3 మ్యాచ్‌లు ఆడిన స్కాట్లాండ్ అంత ఈజీగా ఇతర జట్లకు లొంగలేదు. క్వాలిఫయర్స్‌లోనూ బంగ్లాదేశ్‌ను ఓడించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రస్థానం వరల్డ్‌కప్ వరకు తెచ్చుకున్న స్కాట్లాండ్ ఇంతవరకు రావడం వెనుక చాలా కృషి ఉంది. స్కాట్లాండ్ క్రికెట్‌తో మన మాజీ టీమిండియా ఆటగాడు ది వాల్, టీమిండియాకు కాబోయే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు ఒక లింక్ ఉంది. శుక్రవారం ఇండియా-స్కాట్లాండ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాహుల్ ద్రావిడ్ ట్వీట్టర్‌లో ట్రెండింగ్‌లో కనిపించాడు.
దీనికి కారణం గతంలో ద్రావిడ్ స్కాట్లాండ్ జట్టు తరఫున ఆడడమే. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు అంచనాలు లేకుండా బరిలో దిగి ఫైనల్ చేరి, రన్నరప్‌గా నిలిచింది. ఆ మ్యాచ్ తర్వాత భారత్ సీనియర్ ఆటగాళ్లు క్రికెట్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఈ సమయంలో రాహుల్ ద్రావిడ్ స్కాట్లాండ్ జాతీయ జట్టు తరుఫున 11 మ్యాచులు ఆడాడు. స్కాట్లాండ్‌లో క్రికెట్‌కు ఆదరణ పెంచడంతో పాటు వారి క్రీడాభివృద్ధిలో భాగంగా భారత కోచ్ జాన్ రైట్, స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ గ్వేన్ జోన్స్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్కాట్లాండ్ నేషనల్ లీగ్‌లో 12 మ్యాచుల్లో 11 మ్యాచులు ఆడిన రాహుల్ ద్రావిడ్, 66.66 సగటుతో 600 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇందులో 3 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇలా స్కాట్లాండ్ క్రికెట్‌తో రాహుల్ ద్రావిడ్ అనుబంధం ఏర్పడింది. ద్రావిడ్‌ను స్కాట్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికి ఇష్టపడతారు.