బంగ్లాదేశ్‌లో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఒక్క వికెట్ తేడాతో ఓడిన టీమిండియా.. ఢాకా వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి.. కేవలం 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ.. మెహిదీ-మహ్మదుల్లా జోడీ బంగ్లాదేశ్‌ను ఆదుకుంది. వీరిద్దరు కలిసి 148 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, మహ్మదుల్లా అవుటైనా.. మెహిదీ చెలరేగి సెంచరీ బాదడంతో బంగ్లా 50 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అయితే.. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేలు ఓడిన టీమిండియా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. కాగా.. బంగ్లాదేశ్‌పై రెండు వరస ఓటములపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ ఒక విచిత్రమైన కారణం చెప్పుకోచ్చాడు. గత కొన్ని నెలలుగా టీమిండియా ఆటగాళ్లు కేవలం టీ20లపైనే ఫోకస్ పెట్టి.. టీ20 మ్యాచ్‌లే ఎక్కువగా ఆడిన కారణంగా వన్డేల్లో విఫలం అవుతున్నట్లు ద్రవిడ్ పేర్కొన్నాడు. వెంటవెంటనే రెండు టీ20 వరల్డ్ కప్‌లు(2021, 2022) ఉండటంతో తాము ఎక్కువగా టీ20లకే ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించాడు. ఇలా టీ20ల మూడ్‌లో ఉన్నందున వన్డే పార్మాట్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం అవుతున్నట్లు పేర్కొన్నాడు.
కాగా.. రాహుల్ ద్రవిడ్ కామెంట్లపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. టీ20ల్లో ఏం సాధించారని.. ఇంకా వాటి గురించే ఆలోచిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్నారు కదా? ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ ఆడి నేరుగా బంగ్లాదేశ్ వెళ్లలేదు కాదా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీస్ వరకు వెళ్లిన టీమిండియా సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లతో పాటు హెడ్ కోచ రాహుల్ ద్రవిడ్‌కు సైతం బీసీసీఐ న్యూజిలాండ్ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చింది. అయినా కూడా రాహుల్ ద్రవిడ్ బంగ్లాదేశ్‌పై వైఫల్యాన్ని టీ20 క్రికెట్‌పై నెట్టడం హాస్యాస్పదంగా ఉందని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
Rahul Dravid said, “we’ve prioritised T20s in the last few years due to two T20 World Cups, so alot of our boys haven’t played much of ODIs”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2022