భారత్- న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. కేవలం ఒక్క వికెట్ దూరంలో విజయం కాస్తా.. డ్రాగా ముగిసింది. డిక్లేర్ చేయడం.. ఆట కాస్త వేగంగా ఆడుంటే ఫలితం ఇంకోలా ఉండేదేమో అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రహానే ఆట తీరుపై ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సైతం వ్యంగాస్త్రాలు విసరడం చూశాం. ‘ఇప్పటికీ రహానేకి టెస్టు జట్టులో చోచు దక్కుతోందంటే అది అతని అదృష్టమే అనాలి’ అంటూ గంభీర్ వ్యాఖ్యానిచిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంలోనే రహానే అసలు కెప్టెన్ కాకుంటే జట్టులో చేటు దక్కేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండు ఇన్నింగ్స్ లోనూ రహానే బ్యాటింగ్ విఫలమవ్వడం చూశాం. తాజా ప్రదర్శనతో విమర్శలు మరింత ఊపందుకున్నాయి. మొదటి టెస్టుకు కోహ్లీ లేనందున కెప్టెన్ గా అవకాశం దక్కింది. రెండో టెస్టుకు కోహ్లీ వస్తున్న దృష్ట్యా రహానేపై వేటు పడనుందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు.
రహానే ఫామ్ పై వస్తున్న విమర్శలకు కోచ్ రాహుల్ ద్రావిడ్ చెక్ పెట్టాడు. ‘రహానే ఫామ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ప్రదర్శనతో అతడిని అంచనా వేయలేం. ఎన్నో సందర్భాల్లో టీమిండియాను రహానే గట్టెక్కించడం చూశాం. అతనిలాంటి టెక్నిక్ ఉన్న ప్లేయర్ ప్రస్తుతం టీమిండియాకి అవసరం. రెండో టెస్టులో ఉంటాడా? లేదా? అనేది కోహ్లీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటివరకు అయితే రహానే తుదిజట్టులో ఉన్నాడు’ అంటూ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.