వీడియో: ఎప్పుడూ కామ్‌గా ఉండే ద్రవిడ్‌.. ఆ రోజు షాంపెన్‌ బాటిల్‌తో రచ్చ రచ్చ చేశాడు!

రాహుల్‌ ద్రవిడ్‌ అంటే.. మెచ్యూరిటీ మారుపేరు. ఓడినా, గెలిచినా చాలా స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తుంటాడు. అందుకే ధోని కంటే ముందే ద్రవిడ్‌కు మిస్టర్‌ కూల్‌ అనే బిరుదు ఉంది. అలాంటి ద్రవిడ్‌ ఒక సారి మాత్రం డ్రెస్సింగ్‌రూమ్‌లో రచ్చ రచ్చ చేశాడు.

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం భారత జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎలా ఉంటాడో అందరికి తెలిసిందే. ఎప్పుడూ చాలా గంభీరంగా, సైలెంట్‌గా ఉంటారు. ఎవర్నీ ఒక మాట అనడు, ఒకరితో మాట అనిపించుకోడు. మొత్తంగా వివాదరహితుడు, మృదుస్వభావి. చాలా తక్కువ సందర్భాల్లోనే ద్రవిడ్‌ను పట్టలేని సంతోషంలో చూస్తాం. అలాంటి ఒక సందర్భం సరిగ్గా 22 ఏళ్ల క్రితం చోటు చేసుకుంది. ఆ టైమ్‌లో ద్రవిడ్‌ను డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎవరూ కంట్రోల్‌ చేయలేకపోయారు. ఆ రోజు ద్రవిడ్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏంటి? ద్రవిడేనా ఇలా చేస్తోంది అంటూ మిగతా జట్టు సభ్యులంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ సంఘటన ఇప్పుడూ చూసినా.. అది ద్రవిడ్‌ అంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి.

షాంపెన్‌ బాటిల్‌నే చేతుల్లోకి తీసుకుని.. పట్టలేని సంతోషంతో జట్టు సభ్యులతో షాంపెన్‌ను చిమ్ముతున్న ద్రవిడ్‌ను చూస్తే.. నమ్మడం కాస్త కష్టమే అయినా అది నిజం. ఈ సంఘటన 2001లో చోటు చేసుకుంది. టీమిండియా సృష్టించిన చరిత్ర తర్వాత జరిగిన సంబురాల్లో ద్రవిడ్‌ తన శాంతస్వభావాన్ని పక్కనపెట్టిమరీ రెచ్చిపోయాడు. జట్టు సాధించిన అద్వితీయమైన విజయంతో తనలోని చీల్‌ గాయ్‌ని బయటికి తెచ్చాడు. ఈ అరుదైన దృశ్యాలు 2001లో కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ క్రికెట్‌ స్డేడియం డ్రెస్సింగ్‌ రూమ్‌లో చోటు చేసుకున్నాయి. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా గర్వాన్ని అణిచి, ఫాలో ఆన్‌ ఆడిన టెస్టులో వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా సాధించిన గొప్ప విజయం ఏ భారత క్రికెట్‌ అభిమాని కూడా మర్చిపోడు.

ఆ మధుర విజయం సిద్ధించి మంగళవారంతో 22 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అలనాటి వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ షాంపెన్‌ బాటిళ్లతో షాంపెన్‌ చిమ్ముతున్న దృశ్యాలు మరోసారి క్రికెట్‌ అభిమానులను అలరిస్తున్నాయి. తమ అభిమాన ఆటగాళ్ల చరిత్ర సృష్టించి, ఆ సంతోషకర ఘట్టాన్ని ఆస్వాదిస్తున్న క్షణాలను ఇప్పటికీ క్రికెట్‌ అభిమానుల కళ్లల్లో కాంతులు విరచిల్లుతున్నాయి. ఆ టెస్టులో లక్ష్మణ్‌ 281, ద్రవిడ్‌ 180 పరుగులు చేసి భారత్‌కు అతి గొప్ప విజయం అందించారు. ఆ విజయంతోనే ఇండియా గంగూలీ కెప్టెన్సీలో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు.. ఆస్ట్రేలియా వరుస విజయాల పరంపరకు అడ్డుకట్ట వేసి.. కంగారుల గర్వం దించింది. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప విజయం తర్వాత భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. అందులో ద్రవిడ్‌ చేసిన రచ్చ హైలెట్‌గా నిలిచింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV