మన దేశాన్ని ప్రపంచ యవనికపై నిలబెట్టిన రన్నర్ అంటే పీటీ ఉషనే గుర్తొస్తుంది. తన పరుగుతో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న ఆమె.. ఎందరో అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచింది. ప్రస్తుతం అథ్లెట్స్ గా మారుతున్న చాలామంది ఉషనే ఆదర్శంగా తీసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్టార్ క్రీడాకారిణి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. అది కూడా మీడియా ఎదుట. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మన దేశంలో క్రీడల పరంగా ఎందరికో స్పూర్తిగా నిలిచిన పీటీ ఉష, గత నవంబరులో భారత ఒలింపిక్ సంఘం(IOA)కి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎంపికైంది. ఈ పదవిలోకి వచ్చిన తొలి మహిళగా ఘనత సాధించింది. క్రీడారంగంలో పీటీ ఉష చేసిన కృషికిగానూ బీజేపీ, జులై 6న రాజ్యసభకు కూడా నామినేట్ చేసింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే అసలు సమస్య ఇప్పుడే మొదలైనట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నాసరే కిందస్థాయి అధికారుల వల్ల అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగినట్లు కనిపిస్తుంది.
‘కేరళ స్పోర్ట్స్ స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణం మొదలుపెట్టారు. వాళ్లని వెళ్లి అడిగితే దురుసుగా ప్రవర్తించారు. తమ దగ్గర అనుమతి ఉందని దబాయించారు. పోలీసులకు చెప్పిన తర్వాతే ఆ పని ఆపుచేశారు. రాత్రిపూట డ్రగ్ ఆడిక్స్, కొన్ని జంటలు అకాడమీ పరిసరాల్లోకి సంచరిస్తున్నాయి. ఇంకొందరైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోనే చెత్త వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా చాలా సమస్యలు సృష్టిస్తున్నారు. స్థానిక అధికారులు అస్సలు సహకరించడం లేదు. ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ స్కూల్ లోని మహిళ అథ్లెట్ల్ భద్రతపై నాకు భయంగా ఉంది’ అని పీటీ ఉష కన్నీళ్లు పెటుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త క్రీడావర్గాల్లో సంచలనంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందనేది చూడాలి. మరి ఏకంగా ఒలింపిక్ ప్రెసిడెంట్ స్వయంగా కబ్జాలు జరుగుతున్నాయని కన్నీరు పెట్టుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.