టీ20 ప్రపంచకప్ లో సెమీస్ లోనే ఇంటిదారి పట్టిన భారత జట్టు మరో పొట్టి సిరీస్ కు సిద్ధమైంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న భారత జట్టు నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో అమీ.. తుమీ తేల్చుకోనుంది. ఈ టూర్ కు కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరంగా ఉండడంతో, యువ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచులో విజయం ఎవరిని వరించనుంది? ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు బలం బ్యాటింగ్. ఈ మ్యాచులో ఇండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ, డీకే వంటి సీనియర్లు లేకుండా బరిలోకి దిగుతోంది. అయినప్పటికీ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో భారత్ జట్టు పటిష్టంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఎలాగూ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తే చెలరేగడం పక్కా. మరోవైపు శుభ్ మాన్ గిల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా వంటి యువ బ్యాటర్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బ్యాటింగ్ లో పటిష్టంగా ఉన్న భారత జట్టు బౌలింగ్ విభాగంలో రాణిస్తే సిరీస్ లో పైచేయి సాధించవచ్చు.
కివీస్.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో బలంగానే ఉంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే కీలకం కానుండగా మిడిల్ ఆర్డర్ లో గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్ చెలరేగే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ట్రెంట్ బోల్ట్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నా మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే కీలకం కానున్నారు. స్వదేశీ పిచులు కనుక కివీస్ ఆటగాళ్లకు అనుకూలంగా ఉండవచ్చు.
టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు 20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 11 మ్యాచుల్లో గెలవగా, న్యూజిలాండ్ 9 సార్లు విజయం సాధించింది. అంటే ఇండియాదే కొంచెం పైచేయి.
ఈ మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. డ్రాప్-ఇన్ వికెట్ పిచ్ ఉపయోగిస్తారు. ఇది బౌలర్ల కంటే బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే సీమర్లు చెలరేగే అవకాశాలూ ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు 160-170 మధ్య పరుగులు చేసే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించవచ్చు.
ఇరుజట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత ఈ మ్యాచులో న్యూజిలాండ్ విజయం సాధించే అవకాశం ఎక్కువుగా ఉంది. బ్యాటింగ్‌లో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నా.. బౌలింగ్‌లో కివీస్ కొంత బలంగా కనిపిస్తుంది. అది కాక.. స్వదేశీ పిచులు వారికి అనుకూలంగా ఉండవచ్చు.
భారత జట్టు: శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రిషబ్ పంత్, దీపక్ హుడా/వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
Just 1️⃣ sleep away from the first #NZvIND T20I ⏳#TeamIndia pic.twitter.com/qiJXEAlG43
— BCCI (@BCCI) November 17, 2022