ఆసియా కప్ 2023 వేదికపై ఇప్పటికీ సందిగ్దతే ఉంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నజాం సేథీ కొన్ని చౌకబారు వ్యాఖ్యలు చేశాడు. పాక్ టీమ్ ను ఇండియాకు పంపాలంటే మాకు కూడా భయంగా ఉందని చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ 2023.. గత కొంతకాలంగా క్రికెట్ ప్రపంచంలో వార్తల్లో నిలుస్తున్న టోర్నీ. దానికి ప్రధాన కారణం, పాక్ లో ఆసియా కప్ నిర్వహిస్తే.. అక్కడికి భారత జట్టు రాదు అని బీసీసీఐ ప్రకటించిన విషయం మనందరికి తెలిసిందే. ఇక ఆసియా కప్ 2023 వేదికపై ఇప్పటికీ సందిగ్దతే ఉంది. అయితే భారత్ ఆడే మ్యాచ్ ల వరకు యూఏఈలో నిర్వహిస్తేనే భారత్ ఈ టోర్నీలో పాల్గొంటుంది అని బీసీసీఐ షరతులు పెట్టింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నజాం సేథీ కొన్ని చౌకబారు వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ లో నిర్వహించే ఆసియా కప్ 2023 కోసం భారత్, పాక్ కు రాకపోతే.. 2023 వన్డే వరల్డ్ కప్ కోసం పాక్ కూడా భారత్ లో అడుగుపెట్టదు అని అప్పటి మాజీ పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపడంతో.. అతడిని పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించారు. అయితే అతడి ప్లేస్ లో పీసీబీ బాధ్యతలు తీసుకున్న నజాం సేథీ కూడా తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఆసియా కప్ 2023 టోర్నీని పాక్ నుంచి తరలించే ప్రసక్తే లేదని సేథీ అన్నాడు. తాజాగా ఈ విషయంపై సేథీ మాట్లాడుతూ..
“గతంలో మేం ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ సమావేశాలకు వెళ్లినప్పుడు వారు మాకు చాలా ఆఫర్లు ఇచ్చారు. అవన్ని విన్న తర్వాత మేం ఓ నిర్ణయానికి వచ్చాం. ప్రపంచంలోని మిగతా జట్లు అన్ని వచ్చి పాక్ లో క్రికెట్ ఆడుతున్నాయి. వారికి లేని సెక్యూరిటీ రీజన్స్ భారత ఆటగాళ్లకు ఎందుకు? ఇక మీ ఆటగాళ్లకు పాక్ కు రావడానికి ఎంత భయపడుతున్నారో.. మా పాక్ టీమ్ ను ఇండియాకు పంపడానికి మేం కూడా అంతే భయపడుతున్నాం” అని చెప్పుకొచ్చాడు నజాం సేథీ. ఆసియా కప్ ను తటస్థ వేదికలో నిర్వహించడం మేం ఎంత మాత్రం ఒప్పుకోం అని స్పష్టం చేశాడు సేథీ.
ఇక పీసీబీ ఛైర్మన్ చౌకబారు వ్యాఖ్యలపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ లో భద్రత ఎలా ఉందో? ఇండియాలో భద్రత ఎలా ఉందో ఒక్కసారి చూసి మాట్లాడు అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇక ఈ విషయంపై భారత్ ఇప్పటికే తన వైఖరిని చెప్పింది. భారత్ ఆడే మ్యాచ్ లన్ని యూఏఈ లో నిర్వహిస్తేనే మేం ఆసియా కప్ లో పాల్గొంటాం అని షరతులు విధించింది బీసీసీఐ. ప్రస్తుతం నజాం సేథీ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరలేపే విధంగా ఉన్నాయంటున్నారు క్రికెట్ పండింతులు. ఇక మేం సక్రమంగానే ఆసియా కప్ నిర్వాహణ హక్కులు దక్కించుకున్నామని సేథీ అన్నారు. మేం ఇప్పుడు తలొగ్గితే 2025లో పాక్ లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఇక్కడి నుంచి వేరే చోటుకు తరలించాలంటారని పీసీబీ ఛైర్మన్ చెప్పుకొచ్చాడు. మరి ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.