ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇరు దేశాల మధ్య సిరీస్‌లు మాత్రం జరగట్లేదు కానీ ఐసీసీ ఈవెంట్లు ఈ ఆసక్తికర పోరుకు వేదికవుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి జరగనున్న ట్వీ20 వరల్డ్ కప్‌లో భారత్ పాక్ తలపడనున్నాయి. ఏ మెగా ఈవెంట్ అయినా ఇండియా పాకిస్తాన్ మ్యాచే హైలెట్‌గా నిలుస్తుంది. రెండు దేశాల క్రికెట్ అభిమానులే కాక అన్ని దేశాల క్రికెట్ అభిమానులు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌పై ఆసక్తి చూపిస్తారు. ట్వీ20 వరల్డ్ కప్ లో అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. ఇదే విషయంపై పాకిస్తాన్ స్టార్ పేసర్ హాసన్ అలీ స్పందిస్తూ.. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి మేం ట్రోఫీని గెలిచాం, ఆ మ్యాచ్ గుర్తుంచుకోవాలి. అదే విధంగా ట్వీ20 వరల్డ్ కప్ లో కూడా భారత్‌ను ఓడిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఈ స్పందనపై భారత్ అభిమానులు కామెడీగా తీసుకుని హాసన్ అలీ ని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.
పాకిస్థాన్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌కే మెరుగైన రికార్డే ఉంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ 7 సార్లు భారత్, పాక్ ఢీకొనగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 5 సార్లు తలపడగా నాలుగుసార్లు భారత్ గెలవగా.. ఒక్కసారి డ్రా అయింది. ఇక మ్యాచ్‌ల పరంగా మాత్రం పాక్‌దే పైచేయి. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 59 టెస్ట్‌లు జరగ్గా.. పాక్ 12 సార్లు గెలవగా, భారత్ 9 సార్లే విజయం సాధించింది. 38 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. 132 వన్డేల్లో 73 పాక్ గెలవగా.. భారత్ 55 మాత్రమే విజయం సాధించింది. 4 మ్యాచ్‌లు టై అయ్యాయి. ఇక టీ20ల్లో ఇరు జట్లు 8 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించగా, పాక్ ఒకేసారి గెలుపొందింది. మరొక మ్యాచ్ డ్రా అయింది.