Pakistan: క్రికెట్‌లో ఎన్ని నవ్వుల పాలయ్యే ఘటనలు ఉన్నాయో వాటిలో చాలా వరకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేరిటే ఉన్నాయి. ఇప్పుడు వారి గల్లీ క్రికెట్ సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్రికెట్‌లో చిత్రవిచిత్రమైన జట్టుగా పాకిస్థాన్‌కు పేరుంది. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకరోజు ఛాంపియన్‌లా ఆడే ఆ జట్టు మరుసటి రోజు పసికూన చేతుల్లో చిత్తుగా ఓడిపోతుంది. ఇలా నిలకడలేని జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్థాన్. అంతేకాదు.. క్రికెట్‌లో రూల్స్ విషయంలోనూ పాక్ క్రికెటర్లు అనేకసార్లు నవ్వుల పాలైన సంఘటనలు ఉన్నాయి. రూల్స్ తెలియక అంపైర్లతో వాదనకు దిగి.. చివాట్లు తిన్నారు. అందుకు పాకిస్థాన్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ అజమ్ సైతం అతీతుడేం కాదు. అతను కూడా టీ20 వరల్డ్ కప్ 2022లో నో బాల్‌కు కోహ్లీ అవుట్ అయ్యాడని, అయినా రన్ ఎలా తీస్తాడని అంపైర్‌తో వాదించి.. నవ్వుల పాలయ్యాడు.
అలాగే ఫీల్డింగ్ విషయంలోనూ పాకిస్థాన్ ఆటగాళ్ల రూటే వేరు. ఒక క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు పరిగెత్తుకు రావడం.. ఒకరు పడతారని, ఇంకొకరు క్యాచ్ నేలపాలు చేయడం వారి అలవాటు. ఇతర జట్లలో ఒక క్యాచ్ పట్టేందుకు ఇద్దరు ఆటగాళ్లు ఢీ కొని గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి కానీ, పాక్ ఆటగాళ్లు మాత్రం అలా ఒకరినొకరు చూస్తూ.. బాల్ క్యాచ్‌ను వదిలేస్తారు. ఇలాంటి చిత్రవిత్రిమైన ఫీల్డింగ్, క్యాచ్ మిస్‌లు వారికే సాధ్యం అవుతాయి. అయితే.. ఇవన్ని అంతర్జాతీయ స్థాయిలో మనం చూసినవే. అయితే.. వారి గల్లీ క్రికెట్ మరీ దారుణంగా ఉంటుంది. అందుకే ఈ వీడియోనే సాక్ష్యం.
బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ సగం పిచ్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. అది బౌలర్ చేతుల్లోంచి రిలీజ్ కాగానే.. కనీసం స్టెంప్ కూడా పడకముందే దాన్ని టచ్ చేసి రన్‌పూర్తి చేస్తాడు. బాల్ తన దగ్గరికి వచ్చేంత వరకు ఓపిక పట్టలేకపోయాడో ఏంటో కానీ.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి గల్లీ క్రికెట్ కేవలం పాకిస్థాన్ వాళ్లకే సాధ్యం అవుతుందని, ఇలాంటివి కేవలం వారి సొంతం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.