పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి చూసి చాలా మంది అయ్యో పాపం అంటున్నారు. మరికొంతమంది బాగయ్యిందిలే అంటూ సంబర పడుతున్నారు. మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు పర్యటన రద్దు చేసుకుని న్యూజిలాండ్ వెళ్లిపోవడాన్ని పాకిస్థాన్ క్రికెటర్లు, అభిమానులు సహా పీసీబీ కూడా తప్పుబడుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ కూడా వారి పర్యటన రద్దు చేసుకోవడం.. అభద్రతాభావాన్ని వ్యక్త పరచడంతో పాకిస్థాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మీరు పాకిస్థాన్ క్రికెట్ చంపేశారంటూ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రమీ రాజా చేస్తున్న వ్యాఖ్యలు వారికి కొత్త తిప్పలు తెస్తాయేమో అంటూ పైకి చెప్పకపోయినా.. లోలోపల బాధపడుతూనే ఉన్నట్లున్నారు.
విషయం ఏంటంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా వారిదైన శైలిలో న్యూజిలాండ్, ఇంగ్లాడ్ పర్యటనల రద్దు అంశంపై స్పందించాడు. బాహాటంగానే వారికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అదేంటంటే ‘ఇప్పటివరకు మాకు టీమిండియానే టార్గెట్‌గా ఉండేది.. ఇప్పట్నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ కూడా మా టార్గెట్ లిస్ట్‌లోకి చేరాయి’ అంటూ రమీజ్ రాజా కామెంట్ చేశాడు. రానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో తమ ప్రతీకారం చీర్చుకుంటారని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు కొండంత ఆశతో ఉన్నారు. మరి రమీజ్ రాజా ప్రగల్భాలను పాకిస్థాన్ ప్లేయర్లు ఎంత వరకు నిలబెడతారో చూడాలి. ఈ స్టేట్‌మెంట్‌పై నెటిజన్స్ తమదైన శైలిలో ఆడుకుంటున్నారు. రమీజ్ రాజాకు కామెంట్ల రూపంలో కౌంటర్లు వేస్తున్నారు. మొన్నటిదాకా టీమిడింయా చేతిలోనే ఓడిపోవాలనుకున్నారు.. ఇప్పుడు న్యూజిలాండ్, ఇంగ్లాడ్ చేతిలో కూడా ఓటమి కోరుకుంటున్నారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
రమీజ్ రాజా వ్యాఖ్యలపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.