ఉప్పల్‌లో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఈ మ్యాచ్‌లకు సంబంధించి ఐసీసీకి బీసీసీఐ పంపిన డ్రాఫ్ట్‌లో ఏముందనేది ఆసక్తికరంగా మారింది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసింది. అయితే ఫ్యాన్స్ ఆశించినట్లుగా ఈ మ్యాచ్‌లో భారత్ ప్రదర్శన చేయలేదు. జట్టు సెలక్షన్ దగ్గర నుంచి ప్లేయర్స్ ఆటతీరు వరకు టీమిండియాలో ఎన్నో తప్పులు, లోపాలు కనిపించాయి. ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నంబర్ వన్ టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకోకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. అదే టైమ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ ఫెయిల్ అవ్వడం జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన టీమిండియా.. కంగారూలపై పరాజయంతో మరోసారి కప్‌ను చేజార్చుకుంది. దీంతో జట్టు గెలుపుపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ముగియడంతో ఇక అందరి చూపులు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వైపు మరలనున్నాయి. టోర్నీకి ఇంకా నాలుగు నెలల టైమ్ ఉంది. ఈ మధ్యలో భారత్ ఆడాల్సిన ఇతర సిరీస్‌లు కూడా ఉన్నప్పటికీ ఈ ఏడాది ప్రపంచ కప్ మీదే అందరి దృష్టి నెలకొని ఉంది. గత కొన్నేళ్లుగా భారత్ ఐసీసీ కప్‌ను అందుకోకపోవడం, డబ్ల్యూటీసీ ట్రోఫీ కూడా చేజారిపోవడంతో వరల్డ్ కప్‌ను ఎలాగైనా మన జట్టు ఒడిసిపట్టాలని అందరూ భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఇప్పటికే ఐసీసీకి బీసీసీఐ పంపిందని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ ఈఎస్పీఎన్ వెల్లడించింది.
వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చెన్నై వేదికగా అక్టోబర్ 15న జరగనున్నట్లు సమాచారం. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను తొలుత అహ్మదాబాద్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇక, టీమిండియా ఆడే మ్యాచ్‌లకు చెన్నై, ఢిల్లీ, పుణె, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వేదికలుగా ఉంటాయని సమాచారం. ఈ మెగా టోర్నీకి బీసీసీఐ షార్ట్ లిస్టు చేసిన వేదికల లిస్టులో ఉన్న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఆడే సూచనలు కనిపించడం లేదు. టీమిండియా మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ రూపొందించిన డ్రాఫ్ట్ షెడ్యూల్లో హైదరాబాద్ పేరు లేదని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.