టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఈమధ్య వరుసగా విఫలమవుతున్నాడు. బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్‌లో కొట్టిన డబుల్ సెంచరీని మినహాయిస్తే.. అతడు మళ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అయినా టీమ్ మేనేజ్‌మెంట్ ఇషాన్ మీద నమ్మకం ఉంచింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌తో విఫలమైనా చాన్స్ ఇచ్చి ప్రోత్సహించింది. న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ జట్టులో చోటు కల్పించింది. కానీ ఇషాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. చెత్త ప్రదర్శనను రిపీట్ చేస్తూ.. టీమ్ మేనేజ్‌మెంట్, ఫ్యాన్స్ తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
ముఖ్యంగా టీ20ల్లో ఇషాన్ కిషన్ దారుణంగా ఫెయిలవుతున్నాడు. చివరి 13 టీ20ల్లో కలిపి ఇషాన్ కిషన్ 15.30 సగటుతో 199 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. దీంతో ఇషాన్ కిషన్‌పై విమర్శలు వస్తున్నాయి. టీమ్‌లో నుంచి అతడ్ని తొలగించాలని.. ఇషాన్ స్థానంలో మరో యంగ్‌స్టర్ పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఇషాన్ గత 13 మ్యాచుల్లో చేసిన స్కోర్లను విమర్శిస్తూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌ను టీమిండియా క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ నితీశ్ రాణా లైక్ కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
భారత జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న నితీశ్ రాణా ఈ ట్వీట్‌కు ఎందుకు లైక్ కొట్టాడనేది ఆసక్తికరంగా మారింది. ఇషాన్ కిషన్ వరుసగా ఫెయిలవుతున్నా చాన్సులు ఇవ్వడం ఏంటని ఇన్‌డైరెక్ట్‌గా నితీశ్ రాణా.. ట్వీట్‌కు లైక్ కొట్టడం ద్వారా చెప్పకనే చెబుతున్నాడని కొందరు అంటున్నారు. ఇక, క్రికెట్ అనే కాదు ఏ క్రీడలోనైనా విఫలమవ్వడం సహజం. చాలా మంది స్టార్ క్రికెటర్లు బ్యాడ్ ఫేజ్ చూశారు. అయితే జట్టు మేనేజ్ మెంట్, కెప్టెన్ ప్రోత్సాహంతో మళ్లీ బలంగా స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చారు. బంగ్లాదేశ్ మీద కొట్టిన డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్‌లో ఎంత సత్తా ఉందనేది, అతడి ప్రతిభ ఏంటనేది అందరికీ తెలిసిపోయింది.
బంగ్లాపై ఇన్నింగ్స్ తర్వాత మాత్రం ఇషాన్ కిషన్ అంతగా ఆకట్టుకోలేదనేది అందరికీ తెలిసిందే. అయితే ఒత్తిడిని జయించలేకపోవడమో లేదా బ్యాడ్ లక్ అనేది తెలియదు గానీ అతడు తరచుగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌కు అండగా నిలవాల్సిన నితీష్ రాణా ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. టీమిండియాకు ఆడిన అనుభవం కూడా ఉన్న నితీష్.. సహచర క్రికెటర్ పరువు తీసేలా ఉన్న ట్వీట్‌ను లైక్ కొట్టడం వివాదాస్పదం అవుతోంది. మరి, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఫెయిల్యూర్‌కు సంబంధించిన ట్వీట్‌ను నితీశ్ రాణా లైక్ చేయడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) January 30, 2023