అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా ముంబయి జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న నికోలస్ పూరన్ సునామీ ఇన్నింగ్స్ తో తన జట్టుకి ఒంటి చేత్తో టైటిల్ అందించాడు. అయితే పూరన్ ఎంత గొప్ప ఫామ్ లో ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు.
వెస్టిండీస్ కి చెందిన విధ్వంసక వీరుడు నికోలస్ పూరన్ ప్రస్తుతం నమ్మశక్యం కాని రీతిలో చెలరేగిపోతున్నాడు. లీగ్ ఏదైనా మెరుపులు మెరిపిస్తూ జట్టుకి విజయాలను అనూహ్య విజయాలను అందిస్తున్నాడు. అసాధ్యమనుకున్న మ్యాచులను కూడా తన బ్యాటింగ్ తో సుసాధ్యం చేస్తూ టీ 20ల్లో ఎంత ప్రమాదకర ఆటగాడో ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో రికార్డ్ స్థాయిలో 16 కోట్లకు అమ్ముడుపోయిన పూరన్.. లక్నో సూపర్ జయింట్స్ కి ప్లే ఆఫ్ కి వెళ్లడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక తాజాగా అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా ముంబయి జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ విండీస్ వీరుడు సునామీ ఇన్నింగ్స్ తో తన జట్టుకి ఒంటి చేత్తో టైటిల్ అందించాడు. అయితే పూరన్ ఎంత గొప్ప ఫామ్ లో ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ జరిగింది. మొత్తం 6 జట్లు పోటీ పడిన ఈ టోర్నీలో ఎంఐ న్యూయార్క్ జట్టు టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ జట్టు తొలి ఓవర్లోనే స్టీవెన్ టేలర్ వికెట్ కోల్పోయింది. అయితే వన్ డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ చెలరేగాడు. వరుస పెట్టి బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 40 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మ్యాచ్ ముగిసే సమయానికి కేవలం 55 బంతుల్లో 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. పూరన్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉండటం గమనార్హం. అతని విధ్వంసానికి సియాటెల్ బౌలర్ల వద్ద ఎలాంటి సమాధానం లేకపోయింది. ఈ క్రమంలో కేవలం 16 ఓవర్లలోనే ఎంఐ టీం లక్ష్యాన్ని చేధించి ఎంఎల్‌సీ ట్రోఫీ అందుకుంది. ఎంతో టాలెంట్ ఉన్న పూరన్.. తన డబ్బు మోజులో పడి దేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు.
ఓ వైపు విండీస్ జట్టు వన్డేల్లో టీమిండియా లాంటి పటిష్ట జట్టుతో సిరీస్ ఆడుతుంటే పూరన్ మాత్రం నాకేమి పట్టదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. దేశం కన్నా నాకు డబ్బే ముఖ్యం అని చెప్పకనే చెబుతున్నాడు. ఓ వైపు విండీస్ క్రికెట్ జట్టు పతన స్థాయిలో పడుతుంటే దేశానికి తనవంతు కృషి చేయాల్సింది మానేసి ఎంచక్కా అంతర్జాతీయ లీగ్ ల మీద దృష్టి పెట్టాడు. సాధారణంగా అంతర్జాతీయ జట్టులో స్థానం లభించిందంటే ఏ ప్లేయర్ అయినా..దేశానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తాడు. కానీ విండీస్ ఆటగాళ్లు మాత్రం ఇందుకు భిన్నంగా. విండీస్ క్రికెట్ బోర్డు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండడంతో వారిచ్చే డబ్బు సరిపోకపోవడంతో స్టార్ ఆటగాళ్లందరూ దేశానికి గుడ్ బై చెప్పి కాసుల వర్షం కురిపించే లీగ్ ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పూరన్ మాత్రం ఓ వైపు విండీస్ జట్టుని వదిలేయకుండానే వేరే లీగ్ లు ఆడడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దేశానికి ఉపయోగపడని సెంచరీలు ఎన్ని సాధించినా పూరన్ ఆస్తి విలువ పెరుగుతుందేమో గాని అతనికి సరైన గుర్తింపు అయితే రాదు. మరి పూరన్ ఇలా దేశానికి కాకుండా అంతర్జాతీయ లీగ్ ల మీద ఆసక్తి చూపించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.