ఒక స్టార్ ఫుట్‌బాలర్ ఆన్లైన్ పేకాటలో రూ.కోట్లు పోగొట్టుకున్నాడు. భారీ మొత్తంలో డబ్బులు పోవడంతో అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిగిలిన వివరాలు..
బ్రెజిల్ స్టార్ ఫుల్బాలర్ జూనియర్ నెమార్ గురించి పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడీ ప్లేయర్. నెమార్ గ్రౌండ్లోకి అడుగుపెట్టాడంటే చాలు.. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రత్యర్థి జట్టులో ఎంత పెద్ద ప్లేయర్లు ఉన్నా నెమార్ పట్టించుకోడు. ఒక్కసారి మైదానంలోకి దిగితే ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ గోల్స్ వర్షం కురిపిస్తాడు. అందుకే ఫుట్‌బాల్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి నెమార్ పేకాటలో తీవ్రంగా నష్టపోయాడు.
ఆన్లైన్లో పోకర్ (పేకాట) ఆట ఆడి ఏకంగా 1 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.9 కోట్లు) పోగొట్టుకున్నాడు నెమార్. పేకాటలో భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో ఈ స్టార్ ఫుట్‌బాలర్ కన్నీటిపర్యంతం అయ్యాడు. నెమార్ ఏడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తొడ కండరాల గాయంతో మూడ్నెలలుగా గేమ్‌కు దూరంగా ఉంటున్న నెమార్.. ఇంట్లోనే ఉంటుండటంతో సరదాగా పోకర్ ఆడుతూ గడపుతున్నాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్ కేంద్రంగా నడుస్తున్న ఆన్లైన్ పోకర్ గేమ్‌లో సభ్యుడిగా ఉన్న నెమార్ బుధవారం రాత్రి ఆట ఆడాడు.
ఈ క్రమంలో గేమ్ ఆడుతూ ఏకంగా రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు నెమార్. దీంతో లబోదిబోమన్న అతడు.. గుక్కపట్టి ఏడుస్తుండగా వెనకాల ‘టైటానిక్’ చిత్రం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తోంది. అయితే కాసేపటి తర్వాత ఏడుపు నుంచి నవ్వు ముఖంలోకి మారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇదంతా కేవలం సరదా కోసమేనని ఒక క్యాప్షన్‌ను కూడా జతచేశాడు. పేకాటలో డబ్బులు రావడం, పోవడం సహజమని నెమార్ అన్నాడు. ఆ తర్వాతి గేమ్‌లో అతడు తాను పోగొట్టుకున్నదంతా తిరిగి గెలుచుకోవడం గమనార్హం. ఇక, ఫిఫా ప్రపంచ కప్ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు నెమార్. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
Neymar Jr. lost €1 Million in an online casino last night🤯 and this was his reaction 😂 pic.twitter.com/GJ3uRyihEs
— ClutchPoints Betting (@CPBetting) March 30, 2023