ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా.. టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరింది. అది కేన్ విలియమ్సన్ కష్టంతో.. అందుకే భారత క్రికెట్ అభిమానులు కేన్ మామకు థ్యాంక్యూ చెబుతున్నారు. అయితే.. న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ మాత్రం.. టెస్టు క్రికెట్ చరిత్రలో బెస్ట్ మ్యాచ్ అనేలా జరిగింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 నేటితో(సోమవారం) ముగుస్తుంది. నాలుగు టెస్టుల్లో భాగంగా టీమిండియా తొలి రెండు టెస్టులను మూడు రోజుల్లోనే ముగించి విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే మూడో టెస్టుల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆ టెస్టు సైతం మూడు రోజుల్లోనే ముగిసింది. దీంతో టీమిండియాలోని పిచ్‌లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తొలి రోజు నుంచే పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను తయారుచేసి.. టెస్టు క్రికెట్ కళను తప్పిస్తున్నారంటూ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. దీంతో నాలుగో టెస్టులో బీసీసీఐ బ్యాటింగ్ ట్రాక్‌ను రూపొందించింది. స్పిన్ పిచ్‌లపై తొలి మూడు రోజులే ఆడిన ఇరు జట్లు.. నాలుగో టెస్టులో మాత్రం మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్తున్నాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు వెళ్లాలంటే టీమిండియా నాలుగో టెస్టులో కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి కానీ, మ్యాచ్ చూస్తే డ్రా అయ్యేలా ఉంది. కానీ.. ఇప్పటికే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిపోయింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ డ్రా అవుతున్నా.. భారత్ ఫైనల్ ఎలా చేరిందని కంగారుపడకండి.. న్యూజిలాండ్ విజయంతో మనకు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే రూట్ క్లియర్ అయింది. అయితే.. భారత్‌ను ఫైనల్ చేర్చేందుకు న్యూజిలాండ్ అద్భుతంగా ఆడింది. టెస్టు మ్యాచ్‌లోని అసలు సిసలైన మజాను చూపిస్తూ.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 355 పరుగుల భారీ స్కోర్ చేసింది. కరుణరత్నే, కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో లంకకు మంచి స్కోర్ వచ్చింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ను లంక బౌలర్లు ఆరంభంలో ఇబ్బంది పెట్టారు. 151 పరుగులకే న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ.. డార్లీ మిచెల్ అద్భుత సెంచరీతో పాటు హెన్రీ 72 పరుగులతో న్యూజిలాండ్‌ను ఆదుకున్నారు. 200 లోపలే ఆలౌట్ అయ్యేలా కనిపించిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యాంగా 373 రన్స్ చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లోనూ 302 పరుగులు చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. న్యూజిలాండ్ ముందు 286 పరుగులు టార్గెట్ ఉంచి లంక.
ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ మరో సారి ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ డెవాన్ కాన్వె 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. టామ్ లాథమ్ 25, హెన్రీ నికోలస్ 20 పరుగులు చేసి నిరాశపరిచారు. దీంతో న్యూజిలాండ్ 90 రన్స్‌కే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి సీనియర్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మిచెల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఆట చివరి రోజు ఈ జంట ఉంటే విజయం ఖాయంలా కనిపించింది. కానీ.. 232 పరుగుల వద్ద మిచెల్ వికెట్ పడిన తర్వాత.. కివీస్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. ఒక ఎండ్‌లో విలియమ్సన్ అలాగే నిలబడిపోయినా.. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి.
232-2తో పటిష్ట స్థితిలో ఉన్న న్యూజిలాండ్ .. కొద్ది సేపటిలోనే 280-8గా మారిపోయింది. పైగా ఆట చివరి రోజు ఓవర్లు కూడా అయిపోతున్నాయి. చివరి మూడు బంతుల్లో 5 పరుగులు కావాల్సిన దశలో కేన్ మామ ఫోర్ కొట్టాడు. మళ్లీ ఐదో బంతి డాట్ అయింది. దీంతో ఆట చివరి బంతికి ఒక్క పరుగు కావాలి. బౌలర్ వేసిన బౌన్స్‌ర్ విలియమ్సన్‌కు సరిగా టైమ్ కాలేదు. అయినా కూడా బైస్ కోసం విలియమ్సన్ వ్యాగ్నర్ పరుగులు తీశారు. కీపర్ బాల్ అందుకుని నాన్‌స్ట్రైకర్ వైపు వేసిన త్రో వికెట్లను గిరాటేసింది. కేన్ విలియమ్సన్ డైవ్‌కొట్టినా.. అవుటై ఉంటాడని లంక ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. కానీ.. రీప్లేలో మాత్రం కేన్ అద్భుతమైన డైవ్‌తో బాల్ వికెట్లకు తగలడానికి ముందే క్రీజ్‌లోకి చేరుకున్నట్లు ఉంది. దీంతో.. న్యూజిలాండ్ సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
న్యూజిలాండ్ విజయంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. రెండో ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీతో న్యూజిలాండ్‌ను గెలిపించడంతో పాటు ఇండియాను డబ్ల్యూటీసీ ఫైనల్ చేర్చాడంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్.. ‘థ్యాంక్యూ కేన్ మామ’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. గతంలో చాలా సార్లు పలు ఫైనల్స్‌కు వెళ్లకుండా టీమిండియాను అడ్డుకున్న న్యూజిలాండ్ ఇప్పుడు మనల్ని డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చిందని కూడా క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా పేర్కొంటున్నారు. గతంలో 2019 వన్డే వరల్ కప్‌లో సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిని విషయం తెలిసిందే. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ 2021లోనూ న్యూజిలాండ్, భారత్‌ను ఓడించింది. ఆ జట్టే ఇప్పుడు భారత్ ఫైనల్ చేరేందుకు కారణమైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kane Williamson did it for Kiwis & India. pic.twitter.com/WSNwnmNWUL
— Johns. (@CricCrazyJohns) March 13, 2023
What a Test match – Kane Williamson has done it for New Zealand and India. pic.twitter.com/9JJeUjNZAM
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2023