ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన యువ ఆర్చర్ వై దీత్య చంద్రిక త్వరలో జరగబోయే జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌కు అర్హత సాధించింది. రాష్ట్ర జట్టు ఎంపికలకు కోసం విజయవాడలో వీఎస్‌సీ ఓల్గా ఆర్చరీ ఫీల్డ్‌లో జిల్లా జట్ల మధ్య పోటీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల ఆర్చరీ క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం రెండు విభాగాలు( అండర్-9, అండర్-12)ల్లో అందులో మూడు క్యాటగిరీల్లో(ఇండియన్ రౌండ్, రికర్వ్, కాంపౌండ్) పోటీలు నిర్వహించారు. ఇండియన్ రౌండ్‌ను ఈ నెల 29న నిర్వహించగా.. రికర్వ్ రౌండ్‌ను బుధవారం నిర్వహించారు. అలాగే కాంపౌండ్ రౌండ్‌ను గురువారం నిర్వహించనున్నారు.
కాగా.. నెల్లూరు జిల్లా జట్టు నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న చంద్రిక అండర్-12 కేటగిరీ, ఇండియన్ రౌండ్‌లో సత్తా చాటింది. ఏకంగా జిల్లా టాపర్‌గా నిలిచి.. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికైంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న చెరుకూరి లెనిన్ ఓల్గా మెమోరియల్ ఓపెన్ 1వ అండర్-12, 5వ అండర్-9 విభాగాల్లో నేషనల్ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున బరిలోకి దిగినుంది. 15, 20 మీటర్ల పోటీల్లో చంద్రిక మంచి ప్రదర్శన కనబర్చింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన చంద్రిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవ్వడంపై ఆర్చరీ అసోసియేషన్ అభినందించింది. కాగా.. చంద్రిక తల్లిదండ్రులు వై.శేషగిరి రావు, పద్మ.. తమ కుమార్తె రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి, నేషనల్ లెవెల్స్ పోటీలకు అర్హత సాధించడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాతో పాటు మన రాష్ట్రానికి తమ బిడ్డ గర్వకారణంగా నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నారు.