ఈ మద్య చాలా మంది చిన్న చిన్న కారణాలతో డిప్రేషన్ లోకి వెళ్లడం.. ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చూస్తున్నాం. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ఇంటర్నేషనల్ మహిళా షూటర్ ఖుష్ సీరత్ కౌర్ సందు (17) ఆత్మహత్య చేసుకుంది. ఎంతో అద్భుతమైన భవిష్యత్ ఉన్న యువ క్రీడాకారిణి ఆత్మహత్యకు పాల్పడటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.
గురువారం (డిసెంబర్ 9) ఉదయం ఫరీద్‌కోట్‌లోని తన ఇంట్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీద్‌కోట్‌లోని హరీందర్ నగర్‌లోని గల్లీ నంబర్ 4లోని తన నివాసంలో ఒక అమ్మాయి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మాకు కంట్రోల్ రూమ్ నుండి కాల్ వచ్చింది. అక్కడికి చేరుకోగానే, మాకు 17 ఏళ్ల ఖుష్ సీరత్ కౌర్ సంధు మృతదేహాన్ని కనిపించింది. ఆమె తన పిస్టల్‌తో తనను తాను కాల్చుకుని, తలకు తగిలిన గాయంతో చనిపోయింది అని ఫరీద్‌కోట్ సిటీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ హర్జిందర్ సింగ్ తెలిపారు.
ఇటీవల ముగిసిన 64వ నేషనల్ ఛాంపియన్ షిప్ లో తాను ఉత్తమ ప్రతిభ కనబరచలేదని అసంతృప్తితో ఉందని.. ఈ నేపథ్యంలోనే కౌర్ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే, ఆమె మృతదేహం వద్ద ఎలాంటి నోట్ లభించలేదని తెలిపారు. సంధు ఇటీవల ప్రదర్శన పట్ల తీవ్ర నిరాశలో ఉందని తెలుస్తోంది. 64 నేషనల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో తన ప్రదర్శన పట్ల అసంత్రుప్తితో ఉంది. సంధు షూటింగ్ లో అనేక జాతీయ పతకాలు సాధించింది. ఈ వారం ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె ప్రదర్శన పట్ల తీవ్ర నిరాశకు గురయ్యారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.