సాధారణంగా క్రికెట్ లో ఒక్కో క్రికెటర్ కు ఒక్కో ప్రత్యేకమైన షాట్ ఉంటుంది. సచిన్ కు కవర్ డ్రైవ్.. సెహ్వాగ్ అప్పర్ కట్.. ధోనికి హెలికాఫ్టర్ షాట్. ఇలా తమదైన మార్క్ షాట్స్ తో అభిమానుల మనసుల్లో ముద్ర వేసుకున్నారు టీమిండియా బ్యాటర్లు. అయితే చాలా మంది క్రికెటర్లు.. వారిది గల్లీ క్రికెట్ అని, చిన్న పిల్లల క్రికెట్ అని అంటే ఒప్పుకోరు. కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం నాది గల్లీ క్రికెటే అని సగర్వంగా చెప్పుకుంటున్నాడు. తాజాగా జరిగిన మాస్టర్ కార్డ్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ధోని మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలోనే తన రాజకీయాల గురించి, తన ఆటకు సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో ఓ అధ్యాయం. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ప్రపంచ కప్ కలను నెరవేర్చిన యోధుడు. ఇక క్రికెట్ లో తనకంటూ ఓ మార్క్ షాట్స్ ను క్రియేట్ చేసుకున్న ధోని.. తన ఆటకు ఎందుకు ఇంతమంది అభిమానులు ఉన్నారు అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చాడు. తాజాగా జరిగిన మాస్టర్ కార్డు ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తన ఆటతీరుపై మాట్లాడుకొచ్చాడు. ఎందుకు నీ ఆటకు ఇంతమంది అభిమానులు ఉన్నారు అన్న ప్రశ్నకు ఈ విధంగా స్పందించాడు.
” నా గేమ్ సహజసిద్దంగా ఉంటుంది. అంటే గల్లీ క్రికెట్ లెక్క అన్నమాట. సాధారణంగా మనం గల్లీ క్రికెట్ లో ఎలా ఆడతామో.. నా ఆటకూడా అలాగే ఉంటుంది. ఈ ఆటతీరే నన్ను వారికి దగ్గర చేసింది. ఈ గల్లీ ఆటతీరుతోనే వారి ప్రేమను పొందగలిగాను” అని ధోని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ధోని ఆడిన కొన్ని కొన్ని షాట్స్ చూస్తే.. అతడు చెప్పింది నిజమనే తెలుస్తుంది. ఇక తన మార్క్ షాట్ అయిన హెలికాఫ్టర్ షాట్ కు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్న సంగతి తెలిందే. ఈ సందర్భంగా రాజకీయాలపై కూడా స్పందించాడు. క్రికెట్ లో రాణించినంత ఈజీ కాదు.. రాజకీయాల్లో రాణించడం అని ధోని అన్నారు. నాలో జట్టును నడిపించే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కానీ.. రాజకీయ నాయకత్వ లక్షణాలు లేవని చెప్పుకొచ్చాడు మిస్టర్ కూల్.