బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో చాలా మంది మిలియనీర్లు అయిపోయారు. హైదరాబాద్‌కు చెందిన ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు కోటీశ్వరుడు అయిపోయాడు. దీంతో తొలిసారి అతను ఐపీఎల్‌లో ఆడనున్నాడు. హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల యువ క్రికెటర్ తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ. కోటీ 70 లక్షలకు కొనుగోలు చేసింది. అండర్-19 ప్రపంచకప్ 2020లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా జట్టులో తిలక్‌వర్మ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
కాగా ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీలో తిలక్ వర్మ 180 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో మెగావేలంలో తిలక్ వర్మ ఐపీఎల్ జట్ల దృష్టిని ఆకర్షించాడు. అందులో భాగంగానే కనీస ధర రూ. 20లక్షలతో వేలంలోకి వచ్చిన తిలక్‌ను ముంబై మంచి ధరకే కొనుగోలు చేసింది. తిలక్ కోసం సన్‌రైజర్స్ తొలుత ప్రయత్నించినప్పటికి డ్రాప్ అయింది. దీంతో తిలక్ ముంబై ఇండియన్స్ ఖాతాలోకి వెళ్లిపోయాడు.
కుటుంబ నేపథ్యం..తిలక్‌వర్మ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. తిలక్ తండ్రి నంబూరి నాగరాజు సాధారణ ఎలక్ట్రిషియన్. ఎంత కష్టమైన కొడుకును క్రికెటర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సమయంలోనే తిలక్ వర్మలోని ప్రతిభను కోచ్ సాలమ్ బయాష్ గమనించాడు. తిలక్‌వర్మకు కోచింగ్‌తో పాటు తన ఇంట్లోనే వసతి కల్పించాడు. అలా అష్టకష్టాలు పడి తిలక్‌వర్మ నేడు మంచి క్రికెటర్‌గా ఎదగాడు. ఐపీఎల్‌లో ఆడాలన్నది తన కల అని, పలు ఫ్రాంచైజీలు నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు వర్మ తెలిపాడు.
తన ప్రతిభతో జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి ఐపీఎల్ మంచి వేదిక అవుతుందని, తన భవిష్యత్తుకు పునాదిలా ఉపయోగపడుతుందని వర్మ పేర్నొన్నాడు. వేలంలో ముంబై ఇండియన్స్‌కు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నట్లు, ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టుతో నా ఐపీఎల్ కెరీర్‌ను ఆరంభించనుండడం సంతోషంగా ఉందన్నాడు వర్మ. గతంలో ఇలాగే ఆటో నడిపే వ్యక్తి కొడుకు మొహమ్మద్ సిరాజ్ కూడా ఐపీఎల్‌తోనే జాతీయ జట్టులోకి వచ్చాడు. మరీ ఐపీఎల్‌లో వర్మ తొలి సారి ఆడుతుండడం, అతనికి దక్కిన ధరపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.