టీమిండియా వరుస విజయాలతో దూకుడు మీదుంది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్ కోసం సమాయత్తమవుతోంది. అయితే ట్రైనింగ్ క్యాంపులో ఉన్న టీమిండియాని ఒక అనుకోని అతిథి వచ్చి సర్ ప్రైజ్ చేశాడు. అది మరెవరో కాదు.. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ. అవును రాంచీలో ఉన్న టీమిండియాని కలిసిన ధోనీ డ్రెస్సింగ్ రూమ్ లో కాసేపు సందడి చేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలను బీసీసీఐ తమ అధికారిక సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసింది. “చూడండి ఈరోజు రాంచీలో జరుగుతున్న ట్రైనింగ్ కి ఎవరు వచ్చారో.. ది గ్రేట్ ఎంఎస్ ధోనీ ” అంటూ కోట్ చేసింది.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ స్టేడియంలో కాసేపు సందడి చేశాడు. అక్కడున్న ఆటగాళ్లు, టీమిండియా సపోర్ట్ స్టాఫ్ అంతా కలిసి ధోనీతో మాట్లాడుతూ కనిపించారు. హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ లను ధోనీ కలిసి కాసేపు మాట్లాడాడు. వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించాడు. న్యూజిలాండ్ టూర్ లో భాగంగా జరగనున్న మూడు టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరగనుంది. ధోనీ హోమ్ టౌన్ రాంచీ కావడంతో అక్కడికి వచ్చి ఆటగాళ్లను ఉత్సాహ పరిచాడు. ధోనీ సర్ ప్రైజ్ విజిట్ ప్రభావం రేపటి మ్యాచ్ లో కచ్చితంగా ఉంటుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంక టీమిండియా విషయానికి వస్తే.. వరుస విజయాలతో జట్టు ఫుల్ జోష్ లో ఉంది. ఇదే దూకుడు ప్రదర్శిస్తే టీ20 సిరీస్ ని కూడా వైట్ వాష్ చేయడం పెద్ద విషయం కాదనే చెప్పాలి. ఇప్పటికే హార్దిక్ పాండ్యా సారధ్యంలో 2-1 తేడాతో శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీ20 సిరీస్ కి రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్, సిరాజ్, షమీలకు విశ్రాంతినివ్వగా.. పాండ్యా, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ లు జట్టులో కొనసాగునున్నారు. మరోవైపు రంజీల్లో దంచికొట్టిన పృథ్వీ షా తిరిగి జట్టులోకి రానున్నాడు. జనవరి 27న రాంచీ వేదికగా తొలి టీ20, జనవరి 29న లక్నో వేదికగా రెండో టీ20, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న మూడో టీ20 జరగనుంది.
Look who came visiting at training today in Ranchi – the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023