టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని ఎంత కూల్ అనేది తెలిసిందే. ఎంతటి కఠిన పరిస్థితులు ఎదురైనా ప్రశాంతంగా ఉంటాడు ధోని. ఇక, అతడి సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మరోసారి ఇది బయటపడింది. అసలేం జరిగిందంటే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. దీంతో అన్ని జట్లు సన్నాహకాల్లో జోరు పెంచాయి. ఇప్పటికే టోర్నీలో ఆడబోయే ప్లేయర్లు అందరూ తమ జట్ల క్యాంప్‌ల్లో చేరారు. ముమ్మరంగా సాధన చేస్తూ మెగా టోర్నీలో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి జట్టు తమ తుది కూర్పును రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. ఈసారి ఐపీఎల్లో కొత్త రూల్స్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు ఏయే ఆటగాళ్లతో బరిలో దిగాలి? జట్టులో ఉన్న ఆల్రౌండర్లను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నాయి.
ఫోర్ టైమ్స్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడి కోసం కప్ కొట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి పక్కనబెడితే.. అతడు ఎప్పుడు గ్రౌండ్లోకి దిగినా ప్రేక్షకుల్లో వచ్చే ఊపే వేరు. మ్యాచ్ ఎంత కఠిన పరిస్థితుల్లో ఉన్నా సీఎస్కేను ధోని గెలిపిస్తాడని అభిమానులు నమ్ముతారు. అందుకుతగ్గట్లే ఎన్నో మ్యాచుల్లో తన కెప్టెన్సీతో పాటు హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ స్కిల్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు ధోని. అందుకే ధోని అంటే సీఎస్కే ఫ్యాన్స్‌కు అంత ఇష్టం.
ఎంఎస్‌డీకి కూడా సీఎస్కే అన్నా చెన్నై అన్నా మక్కువ ఎక్కువ. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌తో ఆడనున్న చెన్నై జట్టు.. హోమ్ గ్రౌండ్లో మాత్రం ఏప్రిల్ 3న బరిలోకి దిగనుంది. చెన్నైలో మ్యాచ్ అంటే అంతా పసుపుమయం కావాల్సిందే. ఈ నేపథ్యంలో చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. ప్రేక్షకులు కూర్చునే సీట్లకు పెయింట్ వేశాడు. తానే స్ప్రే పట్టుకుని సీట్లకు ఎల్లో కలర్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోని సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటున్నారు సీఎస్కే ఫ్యాన్స్. మరి.. సీఎస్కే హోమ్ గ్రౌండ్ మ్యాచ్ చూసేందుకు మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni and the love for the Chepauk Stadium. pic.twitter.com/XD0mN5KqQw
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2023