మహేంద్రసింగ్ ధోని టీమిండియాకు అన్ని రకాల ప్రపంచ కప్‌లు అందించిన కెప్టెన్. ఐపీఎల్ ట్రోఫీలను నాలుగు సార్లు ముద్దాడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను నడిపించిన సారథి. అనితరసాధ్యమైన రికార్డులను టీమిండియా పేరిట లిఖించిన ఘనుడు. ఇండియాకు మొట్టమొదటి ప్రపంచ కప్ అందించిన ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్స్‌లో ఒకరైన కపిల్‌దేవ్, అగ్రెసివ్ కెప్టెన్‌గా టీమిండియా దశా దిశను మార్చిన దాదా సౌరవ్ గంగూలీ తర్వాత కెప్టెన్‌గా అంతలా ప్రభావం చూపించాడు ధోని.
టీమిండియా పగ్గాలు చేపట్టి ఎన్నో అద్భుతమైన విజయాలను జట్టుకు అందించాడు. క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌ను టీమిండియా గెలిచి విశ్వవిజేతగా నిలవడంలో కెప్టెన్‌గా ధోని పాత్ర వెలకట్టలేనిది. అనంతరం అప్పుడెప్పుడో కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్టుకు ఆ తర్వాత అది అందని ద్రాక్షగా మారింది. 2003లో గంగూలీ సారథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ వరకు చేరినా కప్ మాత్రం దక్కలేదు. 2011లో దాన్ని కూడా సాధించి సచిన్ కెరీర్‌కు ఐసీసీ ట్రోఫీ లేదనే మచ్చ లేకుండా చేశాడు. అనంతరం చాంపియన్స్ ట్రోఫీ కూడా సాధించాడు. చివరకు సారథిగా బాధ్యతల నుంచి తప్పుకునే ముందు కూడా టీమిండియాకు విరాట్ కోహ్లీ లాంటి ఆణిముత్యాన్ని కెప్టెన్‌గా అందించాడు.
ఇదీ చదవండి: కప్ గెలిచిన ధోనికి భార్య ఇచ్చిన అద్భుత గిఫ్ట్ ఏంటో తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా చెన్నై జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ సారీ ప్లేఆఫ్స్ కూడా కష్టమే అన్న జట్టుతో ఏకంగా కప్పు కొట్టించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ధోని ఎంత చేసినా కూడా ఒక్క విషయంలో మాత్రం ‘అంతకు మించి’ అనేలా చేస్తాడు. అదే.. కప్ అందుకున్న తర్వాత చేసే సంబరాలు. కెప్టెన్‌గా ఫార్మాలిటీగా ట్రోఫీని పెద్దల నుంచి అందుకుని సింపుల్‌గా జట్టు సభ్యులకు ఇచ్చి ఎక్కడో ఒక మూలన నిల్చుంటాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ నుంచి 2021 ఐపీఎల్ ట్రోఫీ వరకు కూడా అది స్పష్టంగా తెలుస్తుంది. ధోనికి అంతమంది అభిమానులు ఉండేందుకు ఈ సింప్లిసిటీ కూడా ఒక కారణం. విజయం తర్వాత చాలా సాధారణంగా, నిరాడంబరంగా ఉంటాడు.
యువ క్రికెటర్లకు కప్పు అందించి.. ఇక తన పని పూర్తి అయిపోయట్లు సాధించి వారి చేతుల్లో పెట్టేస్తాడు. ఇలా కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపించడమే తన బాధ్యత, సంబరాలు యువ ఆటగాళ్ల హక్కు అని భావిస్తాడో ఏమో కానీ కప్పుతో పాటు ఎప్పుడూ కూడా మధ్యలో కనిపించడు. ధోనిలోని ఈ నిరాండబరతనం చాలా మంది గొప్పగొప్ప ఆటగాళ్లను సైతం నివ్వెరపోయేలా చేస్తుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఆట తర్వాత అద్భుతమైన విజయం దక్కిన అనంతరం ఒక కీలక ఆటగాడు ఎలా తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలో ధోనిని చూస్తే అర్థం అవుతుంది.
ఇండియాలో క్రికెట్ ఒక మతం. దేశం తరఫున ఆడితే వచ్చే గుర్తింపే వేరు. అలాంటిది దేశం గర్వించదగ్గ ఆటగాడిగా ఉండి కూడా ఎప్పుడు సంబరపడిపోలేదు. హుందాగా, బాధ్యతగా తన పని చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. అందుకే మహేంద్రసింగ్ ధోని పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతుంటుంది. మరీ ధోనికి ఉన్న ఈ గొప్ప క్వాలిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఐపీఎల్ విన్నర్ చెన్నై కి దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?