భారత క్రికెట్ అభిమానులకు టీ20 వరల్డ్‌కప్ కన్నా కూడా కెప్టెన్ కూల్ ఈసారి మెంటర్‌గా రాబోతున్నాడని తెలియగానే తెగ సంబరపడి పోతున్నారు. అప్పుడే కప్ గెలిచేసినంత హ్యాపీగా ఉన్నారు అభిమానులు. కానీ, ఇక్కడ అందరికీ వస్తున్న ప్రశ్నేంటంటే మెంటర్‌గా ధోనీ బాధ్యతలు ఏంటి? ధోనీ ఏం చేయబోతున్నాడు? అన్నదే అందరి ప్రశ్న. మెంటర్ అనగానే ఏదో నాలుగు మాటలు చెప్పి టీమ్‌ని ఉత్సాహ పరచడానికే అనుకుంటే మీరు నో బాల్ వేసినట్లే. ధోనీకి చాలా బాధ్యతలు అప్పజెప్పనున్నారు.
వాటిలో ప్రధానంగా హెడ్ కోచ్, కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో చాలా క్లోజ్‌గా ధోనీ పనిచేయబోతున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జేషా ఇప్పటికే వెల్లడించారు. అంటే టీమిండియా ప్రతి వ్యూహంలో ధోనీ మార్క్ కనిపించబోతోంది. కెప్టెన్‌గా ధోనీ వ్యూహాలు, ప్రణాళికలపై ఎవరికీ అనుమానం లేదు. ఇప్పుడు అవే ఆలోచనలు బలంగానూ మారబోతున్నాయి. ఎప్పుడూ టీమ్‌కి వెన్నంటే ఉంటూ వారి లక్ష్యాలను వారికి గుర్తు చేయడం. క్రికెట్‌లో మెంటర్‌గా ధోనీ.. కోచ్ కంటే ఎక్కువ పాత్రనే ప్రదర్శించబోతున్నాడు. ఆటగాళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండటం. టీమ్ మొత్తం సమన్వయంతో పనిచేసేలా చూడటం కూడా ధోనీ బాధ్యతలే. ప్రతి ఆటగాడికి తన బలాబలాలు గుర్తు చేయడం వారి లక్ష్యాన్ని వారికి తెలియజేయటం ప్రధాన బాధ్యతలు. ఇదంతా చూస్తే ధోనీని మెంటర్‌గా సెలెక్ట్ చేయడం వెనుకున్న గంగూలీ అసలు ప్లాన్ కూడా ఇదేనని అర్థమవుతోంది. అక్టోబర్ 17 నుంచి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే.