న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌ను భారత్ విజయవంతంగా ముగించింది. ఈ సిరీస్‌తో శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్ లాంటి యంగ్ ప్లేయర్లలో ఉన్న సత్తా ఏంటో బయటపడింది. భారత జట్టు భవిష్యత్తుకు వీరెంత కీలకమో తెలిసొచ్చింది. ఈ యువ ప్లేయర్లు ఇలాగే మెరుగ్గా ఆడుతూ పోతే టీమిండియాకు ఢోకా ఉండదని చెప్పొచ్చు. కివీస్‌తో సిరీస్ ముగియడంతో ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు, వన్డే సిరీస్ పై అందరి దృష్టి నెలకొంది. టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ కు చేరాలంటే ఆసీస్‌తో జరగబోయే సిరీస్ చాలా కీలకంగా మారింది. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌ను 2–0 లేదా 3–1 తేడాతో భారత్ గెలవాల్సి ఉంటుంది. అప్పుడే టెస్ట్ చాంపియన్‌షిప్ తుదిపోరుకు టీమిండియా అర్హత సాధిస్తుంది.
నిర్ణాయకంగా మారిన కంగారూలతో సిరీస్‌ను ఎలాగైనా గెలవాలని భారత జట్టు కోరుకుంటోంది. అదే సమయంలో మన టీమ్‌ను ఓడించేందుకు ఆసీస్ టీమ్ సమాయత్తమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య పెద్దగా అంతరం లేదు. పేపర్ మీద రెండు జట్లు కూడా బలంగా ఉన్నాయి. అయితే బ్యాటింగ్‌లో ఆసీస్ కంటే భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఆ టీమ్‌లో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌లు తప్పితే మిగతా బ్యాట్స్ మెన్ అంత ప్రమాదకరం కాదు. వీళ్లకు భారత్ పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా ఉంది. ఇక, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్ లాంటి భారీ బ్యాటింగ్ లైనప్‌తో భారత్ బలంగా ఉంది. సొంతగడ్డపై ఆడుతుండటం ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు.
బౌలింగ్‌లో కూడా ఆర్. అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి లాంటి మ్యాచ్ విన్నర్లు భారత జట్టులో ఉన్నారు. రవీంద్ర జడేజా రూపంలో మంచి ఆల్ రౌండర్ కూడా ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. స్టార్ ప్లేయర్లు ఎందరున్నా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఒక బౌలర్ మాత్రం కీలకం కానున్నాడు. అతడే మహ్మద్ సిరాజ్. బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌ల్లో దుమ్మురేపిన ఈ బౌలర్ అంటే ఇప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ వణుకుతున్నారు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని గెలుచుకున్న సిరాజ్.. కంగారూలతో సిరీస్‌లో భారత జట్టుకు ప్రధాన ఆయుధం కానున్నాడు. పేస్‌కు పెద్దగా అనుకూలించని మన పిచ్‌ల మీద రివర్స్ స్వింగ్‌తో కంగారూల పని పట్టేందుకు అతడు సిద్ధమవుతున్నాడు.
సిరాజ్ ఫామ్‌కు ఆసీస్ బ్యాట్స్‌మెన్ అతడి బౌలింగ్‌ను తట్టుకోవడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కొత్త బంతితో అతడు రాణిస్తే మాత్రం ఆసీస్ టాపార్డర్ కుప్పకూలే ప్రమాదం ఉంది. మంచి పేస్‌తో, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో సిరాజ్ వేసే బంతులను ఎదుర్కోవడం వార్నర్, ఖవాజా, లబుషేన్, స్మిత్‌లకు అంత ఈజీ కాదు. ఇక బాల్ పాతబడిన తర్వాత రివర్స్ స్వింగ్‌తో చెలరేగే సిరాజ్ దెబ్బకు ఆసీస్ మిడిలార్డర్, టెయిలెండర్లు తోకముడవడం ఖాయంగా కనిపిస్తోంది. పిచ్ ఏమాత్రం సహకరించినా సిరాజ్ బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడతాడు. అందుకే టీమిండియాలో సిరాజ్ బౌలింగ్ అంటే తమకు భయమని, అతడ్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తులు చేస్తున్నామని పలువురు ఆసీస్ ప్లేయర్లు చెబుతున్నట్లు సమాచారం. మరి, సిరాజ్ తన పేస్ మ్యాజిక్ రిపీట్ చేసి ఈ సిరీస్‌ను భారత్ వశం చేస్తాడేమో చూడాలి.