వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసేందుకు భారత్ 8 వికెట్ల దూరంలో నిలిచింది. చివరి రోజు మ్యాచ్ లో అశ్విన్ ను ఎదుర్కోవడం కరీబియన్లకు కష్టమే అని సిరాజ్ అభిప్రాయపడ్డాడు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు విజయానికి చేరువైంది. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో భారీ విజయాన్నందుకున్న రోహిత్ సేన.. రెండో టెస్టులో నూ గెలువడం ఖాయమే అని హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. బంతి స్పిన్ తిరగడం ప్రారంభమైన పిచ్ పై అశ్విన్ ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో విండీస్ పతనాన్ని శాసించిన రవిచంద్రన్ అశ్విన్.. ఈ సారి కూడా అదే జోరు కనబర్చడం ఖాయమే అని అన్నాడు. 365 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన విండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 76/2తో నిలిచింది. చేతిలో 8 వికెట్లు ఉన్న కరీబియన్లు విజయానికి చివరి రోజు 90 ఓవర్లలో 289 పరుగులు చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఆట ముగిసిన అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. ‘వికెట్ స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. అశ్విన్ సత్తాచాటుతాడు అనిపిస్తోంది. పిచ్ పై టర్న్ లభిస్తోంది. దీంతో యాష్ ను ఎదుర్కోవడం కరీబియన్లకు కష్టమే’ అని అన్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటింగ్ గురించి కూడా సిరాజ్ వెల్లడించాడు. ధాటిగా ఆడాలని ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ‘రెండో ఇన్నింగ్స్ లో ధనాధన్ ఆడాలని డ్రెస్సింగ్ రూమ్ లోనే నిర్ణయం జరిగింది. అందుకు తగ్గట్లే మైదానంలో మనవాళ్లు టీ20 తరహా బ్యాటింగ్ తో మంచి స్కోరు చేశారు. వరుణుడు మ్యాచ్ కు అడ్డు పడుతుండటంతో వీలైనంత వేగంగా పరుగులు సాధించాలనుకున్నాం. విధ్వంసక ఆటతీరుకు పెట్టింది పేరైన ఇషాన్ కిషన్.. దాన్ని టెస్టుల్లోనూ కొనసాగించాడు. దీంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం నిలిచింది’ అని అన్నాడు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన కిషన్ .. అచ్చం పంత్ తరహాలోనే వేగంగా పరుగులు రాబట్టాడు. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్న చందంగా రెచ్చిపోయాడు. ఇక గత రెండు ఇన్నింగ్స్ ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శుభ్ మన్ గిల్.. ఈ సారి సాధికారికంగా ఆడాడు. మరి చివరి రోజు స్పిన్ కి అనుకూలించే పిచ్ మీద అశ్విన్, జడేజా ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.