భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారడంతో.. షమీ తీసుకున్న నిర్ణయానికి టీమిండియా అభిమానులు శభాష్ అంటున్నారు.
టీం ఇండియా ఐసీసీ టైటిల్ కొట్టి దాదాపుగా 10 ఏళ్ళు గడిచిపోయింది. చివరిసారిగా 2013 లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత్..ఈ మధ్యలో చాలా ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ దశకు చేరినా.. ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షాలాగే మిగిలిపోయింది. కెప్టెన్లు మారినా టీం ఇండియా రాత మారడం లేదు. అయితే .. ఈ సారి రెండు ఐసీసీ టోర్నీల్లో భారత్ ఆడనుండడం ఇప్పుడు టీం ఇండియా అభిమానుల్లో అంచనాలను పెంచేస్తుంది. ఒక టీం ఐసీసీ ట్రోఫీ గెలవాలంటే జట్టులో ప్లేయర్లందరూ ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. కీలకమైన ఐసీసీ ట్రోఫీ సమయానికల్లా ఎవరో ఒకరు గాయంతో దూరమవ్వడం కూడా మన జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. 2019 వన్డే ప్రపంచ కప్ లో శిఖర్ ధావన్, 2022 లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో బుమ్రా గాయాలతో దూరమైన సంగతి తెలిసిందే. వీరు ఆ టైంలో అత్యుత్తమ ఫామ్ లో ఉండడంతో ఈ ఇద్దరి గాయాలు భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపాయి.
అయితే ఐపీఎల్ వల్లే ఆటగాళ్లు గాయాల పాలవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్‌కు ముందు మరోసారి ఐపీఎల్ జరగనుండటం భారత జట్టుని కలవరపెడుతుంది. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకొని భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది టీం ఇండియా రెండు ఐసీసీ టోర్నీలు ఆడాల్సి ఉంది. ఒకటి ఇంగ్లండ్‌లో జూన్ 7 నుంచి జరగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కాగా.. మరొకటి స్వదేశంలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్. ఈ రెండు కప్పులను టీమిండియా గెలవాలని భారత క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే 2021 లో డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా రెండోసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరిన భారత్.. ఈ సారి ఆస్ట్రేలియా జట్టుతో ఓడిపోతే అభిమానులు అస్సలు జీర్ణించుకోలేరు. ఇంగ్లండ్ లోని ఓవెల్ మైదానంలో జరగనున్న ఈ ఫైనల్లో పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశముంది.
ఇప్పటికే భారత స్టార్ పేసర్ బుమ్రా గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కి దూరం అవ్వడంతో.. షమీ భారత బౌలింగ్ దళాన్ని లీడ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని షమీ ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు షమీ సంసిద్ధంగా ఉంటాడు. షమీ నిజంగానే ఐపీఎల్‌కు దూరంగా ఉంటే టీమిండియాకు మంచి జరిగినా.. ఐపీఎల్‌ల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్‌కు కాస్త ఇబ్బంది కలగనుంది. ఎందుకంటే ఆ జట్టులో షమీ కీ బౌలర్. గతేడాది గుజరాత్ ఛాంపియన్‌గా నిలిచిందంటే అందులో షమీ పాత్ర కూడా ఎంతో ఉంది. ఏది ఏమైనా.. దేశం కోసం ఆలోచించి, షమీ ఐపీఎల్ కి దూరంగా ఉంటే మాత్రం అతన్ని అభినందించాల్సిందే. బీసీసీఐ సైతం ఈ విషయంలో కాస్త ఆలోచించి ఐపీఎల్ కి మరి కొంత మంది కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వాలని క్రికెట్ అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.