వరల్డ్ క్రికెట్ లో ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాయాదిదేశాల పోరు అంటే స్టేడియాలకు పోటెత్తుతారు అభిమానులు. ఇక మ్యాచ్ కు ముందు పాక్ ఆటగాళ్లు తమ నోటి దురుసును వెల్లగక్కుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు పాక్ తో మ్యాచ్ లేనప్పటికీ పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టీమిండియాపై చౌకబారు వ్యాఖ్యలు చేశాడు. ఇండియాను 2021 టీ20 వరల్డ్ కప్ లో 10 వికెట్ల తేడాతో ఓడించినప్పటి నుంచి నాకు మా దేశంలో అన్ని ఫ్రీగానే లభిస్తున్నాయి అంటూ వ్యాఖ్యానించాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
టీ20 వరల్డ్ కప్-2021లో ఇండియాపై విజయం తన జీవితాన్నే మార్చేసిందని మహ్మద్ రిజ్వాన్ అన్నాడు. అప్పటి నుంచి నాకు మా దేశంలో విపరీతమైన ఫాలోయింగ్, గౌరవ మర్యదలు పెరిగాయని చెప్పుకొచ్చాడు. స్కై స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్ తో రిజ్వాన్ మాట్లాడుతూ..”2021 టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను ఓడించినప్పటి నుంచి నేను షాపింగ్ కు వెళ్లినా, మార్కెట్ కు వెళ్లినా ఓనర్లు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోట్లేదు. వరల్డ్ కప్ లో ఇండియాను ఓడించావు మాకు అది చాలు డబ్బులు అవసరం లేదు అని షాప్ కీపర్లు, ఓనర్లు నన్ను తెగ మెహమాటానికి గురి చేసేవారు” అని రిజ్వాన్ పేర్కొన్నాడు.
అయితే నేను టీమిండియాపై ఆ గెలుపును ఓ సాధారణ విజయంగానే చూస్తానని రిజ్వాన్ అన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2021 తొలి మ్యాచ్ లోనే ఇండియా 10 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ మ్యాచ్ లో బాబర్ 68 పరుగులు, రిజ్వాన్ 79 రన్స్ తో నాటౌట్ గా నిలిచి పాక్ విజయాన్ని అందించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇంగ్లాండ్ పై రెండు టెస్టుల్లో ఓడిపోయిన సంగతి మర్చిపోయి ఈ మాటలు ఏంటి రిజ్వాన్ అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.