క్రికెట్‌లో ఎన్నో స్టన్నింగ్ క్యాచులు చూశాం. బౌండరీ లైన్ వద్ద గాలిలోకి ఎగురుతూ క్యాచులు పట్టడంలో ఇటీవల క్రికెటర్లు మంచి నేర్పు ప్రదర్శిస్తున్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ క్లిష్టమైన క్యాచులను ఒడిసిపడుతున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకునే క్యాచ్ వీటికి మించి అని చెప్పొచ్చు.
క్రికెట్‌లో బౌలింగ్, బ్యాటింగ్ ఎంత ముఖ్యమో ఫీల్డింగ్ కూడా అంతే ముఖ్యం. ఒక జట్టు గెలవాలంటే ఫీల్డింగ్ చాలా ముఖ్యం. ఒకరకంగా చెప్పాలంటే విజయావకాశాలను నిర్ణయించడంలో దీని పాత్ర ఎంతో ఉంది. అందుకే ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని అంటుంటారు. ఒకప్పుడు క్రికెట్‌లో ఫీల్డింగ్‌కు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. అయితే రానురాను దీని ప్రాముఖ్యత తెలియడంతో అంతా అటువైపు దృష్టి పెట్టారు. దీంతో జాంటీ రోడ్స్, మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ లాంటి అద్భుతమైన క్రికెటర్లు పుట్టుకొచ్చారు. వీళ్లు బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిసేవారు. క్లిష్టమైన క్యాచులు పడుతూ, వేగవంతమైన త్రోలతో రనౌట్లు చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ రన్ తీయాలన్నా, షాట్ కొట్టాలన్నా జంకేలా చేసేవారు.
ఇక ఈ తరంలో అన్ని టీమ్స్.. ఫీల్డింగ్ మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ఫీల్డింగ్ కోచ్‌లను నియమించుకుంటుండటమే దీనికి నిదర్శనం. ప్లేయర్లు కూడా ఫీల్డ్‌లో చిరుతల్లా కదులుతూ క్యాచ్‌లను పడుతూ ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచుతున్నారు. ఇకపోతే, మనం ఎన్నో క్యాచ్‌లను చూసుంటాం. బౌండరీ లైన్ వద్ద డైవ్ కొట్టడం, గ్రౌండ్ బయటికి పరిగెత్తి బంతిని లోపలకు విసిరి మళ్లీ క్యాచ్ పట్టుకోవడాన్నీ చూసుంటాం. కానీ ఇక్కడో ప్లేయర్ మాత్రం కాలితో బంతిని ఫుట్‌బాలర్‌లా తన్ని క్యాచ్ పట్టుకున్నాడు. జిల్లా క్రికెట్ క్లబ్ టోర్నీలో భాగంగా ఒక టెన్నిస్ బాల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆఫ్ స్టంప్ అవతల బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్ లాఘవంగా డీప్ వికెట్ వైపు కొట్టాడు. బంతి చాలా ఎత్తులో వెళ్లడంతో అంతా సిక్సర్ అనే భావించారు.
సిక్స్ పోతుందనుకున్న బంతిని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఓ ఫీల్డర్ ఎగిరి పట్టుకున్నాడు. అయితే తిరిగి మైదానంలో సరిగ్గా ల్యాండ్ కాలేకపోయాడు. దీంతో బౌండరీ అవతలకు దూకి, బంతిని గాలిలోకి విసిరి ఫుట్‌బాల్‌లోని ఫేమస్ బ్యాక్‌వాలీ కిక్ కొట్టాడు. గ్రౌండ్ లోపలికి వచ్చిన బంతిని పక్కనే ఉన్న మరో ఫీల్డర్ అందుకున్నాడు. స్థానిక టోర్నమెంట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ కూడా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. క్రికెట్ చరిత్రలో ఇదే గ్రేటెస్ట్ క్యాచ్ అంటూ వాన్ ప్రశంసలు కురిపించాడు. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ వీడియోను అందరితో పంచుకున్నాడు. ఫుట్‌బాల్ కూడా తెలిసిన క్రికెటర్లను మైదానంలో దింపితే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయని సచిన్ మెచ్చుకున్నాడు. మరి, ఈ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Surely the greatest catch of all time … 🙌🙌 pic.twitter.com/ZJFp1rbZ3B
— Michael Vaughan (@MichaelVaughan) February 12, 2023
This is what happens when you bring a guy who also knows how to play football!! ⚽️ 🏏 😂 https://t.co/IaDb5EBUOg
— Sachin Tendulkar (@sachin_rt) February 12, 2023