టీ20 వరల్డ్ కప్ లో ఓడిపోయిన జట్లకు సంబంధించిన మాజీ క్రికెటర్లు.. IPLను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ కారణంగానే ఆటగాళ్లు గాయాల బారిన పడి రాణించలేకపోతున్నారు అంటూ ఇప్పటికే విమర్శల వర్షం కురుస్తోంది. అయితే కొంత మంది విదేశీ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ పుణ్యానే మా ఆట మెరుగైందని చెప్పుకొచ్చారు. ఇక మరికొంత మంది మాత్రం ఐపీఎల్ లో భారీగా డబ్బు వస్తుంది కాబట్టి.. ఆటగాళ్లు ఉత్సాహంగా ఈ టోర్నీకి పరిగెడతారు అంటూ విమర్శలు గుప్పించాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్. డబ్బు కోసం ఆడతారు కానీ దేశం కోసం ఆడరా? అంటూ మండిపడ్డాడు.
IPL.. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా దారుణంగా విఫలం అయిన నేపథ్యంలో బాగా వినిపిస్తోన్న పేరు. టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణంగా ఐపీఎల్ నిలిచిందని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఐపీఎల్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆటగాళ్లకు డబ్బుపై ఉన్న ప్రేమ దేశంపై లేదు అంటూ విమర్శలు గుప్పించాడు. దానికి కారణం లేకపోలేదు.. ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్ మెుయిన్ అలీ తాజాగా మాట్లాడుతూ..”టీ20 వరల్డ్ కప్ ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే మేం ఆసిస్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇంత తక్కువ టైమ్ లో మ్యాచ్ లు అంటే కష్టమే! పైగా మా నుంచి వంద శాతం ఆటను ఆశించడం దారుణం” అంటూ తన ఆవేదనను వ్యక్త పరిచాడు.
ఈ వ్యాఖ్యలపై మండిపడ్డాడు మైఖేల్ క్లార్క్. అలీ వ్యాఖ్యలపై స్పందిస్తూ..”అంతర్జాతీయ షెడ్యూల్స్ పై ఆటగాళ్ల ఫిర్యాదులు కరెక్ట్ కాదు. అదే IPL లీగ్ కోసం వెళ్లాల్సి వస్తే ఎంతో ఉత్సాహాంగా పరుగులు పెడతారు కదా? వెంటనే విమానం ఎక్కేస్తారు కూడా! మీరు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు ఒప్పుకుంటారు. ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి కాబట్టి. మీకు డబ్బు పై ఉన్న ప్రేమ దేశంపై కొద్దిగ కూడా లేదనుకుంటా” అంటూ మైఖేల్ క్లార్క్ మండిపడ్డాడు. అదీ కాక ఐపీఎల్ సమయాల్లో ఎలాంటి ఫిర్యాదులు మీ నుంచి ఉండవు అంటూ చురకలు అంటించాడు క్లార్క్. ఐపీఎల్ ఆడేందుకు చూపిన ఉత్సాహం.. దేశం కోసం ఆడేటప్పుడు చూపలేరా? ఇక నుంచైనా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇలాంటి ఫిర్యాదులకు ముగింపు పలకాలి అని మైఖేల్ క్లార్క్ పేర్కొన్నాడు. ప్రస్తుతం మైఖేల్ క్లార్క్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రీడాలోకంలో హాట్ టాపిక్ గా మారాయి.