ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా తిరిగి మనసు మార్చుకొని మళ్లీ బ్యాట్ పట్టిన ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో బెంగాల్ స్టార్ కూడా చేరిపోయాడు.
నాలుగు రోజుల క్రితమే క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన భారత సీనియర్ ఆటగాడు, బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ నెల 3న సోషల్ మీడియా వేదికగా ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించిన మనోజ్.. మరో సీజన్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది దేశవాళీల్లో బెంగాల్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తివారి.. మరో సీజన్ పాటు బెంగాల్ కోసం ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో వచ్చే ఏడాది రంజీ ట్రోఫీలో మనోజ్ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20 లు ఆడిన తివారి.. వన్డేల్లో ఓ శతకం కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే.ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మరో 92 పరుగులు చేస్తే.. 10 వేల మార్క్ అందుకునే దశలోనే మనోజ్ రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజా నిర్ణయంతో అతడు ఆ ఫీట్ సాధించేల అవకాశాలున్నాయి. 37 ఏళ్ల మనోజ్ తివారి ఓ వైపు క్రికెటర్ గా కొనసాగుతూనే.. మరోవైపు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి గా రెండు పడవల పై ప్రయాణం చేస్తున్నాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన తివారి.. ప్రస్తుతం రంజీల్లో మాత్రమే బెంగాల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బిజీ షెడ్యూల్ లో ఫిట్ నెస్ కాపాడుకుంటూ.. మ్యాచ్ లు ఆడటంతో పాటు పాలనా వ్యవహారాలు చక్కదిద్దడం కష్టమవుతున్న నేపథ్యంలో ఈ నెల 3న మనోజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.గతంలోనూ ఎందరో ఆటగాళ్లు ఇలా రిటైర్మెంట్ ప్రకటించి.. తిరిగి మైదానంలో దిగా సత్తాచాటారు.
తాజా యాషెస్ సిరీస్ ను తీసుకుంటే.. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకొని కేవలం వైట్ బాల్ క్రికెట్ లోనే కొనసాగుతున్న ఇంగ్లండ్ స్పిన్నర్ మోయిన్ అలీ.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక కల్లమ్ అభ్యర్థన మేరకు నిర్ణయాన్ని పక్కన పెట్టి తిరిగి యాషెస్ ఆడాడు. అయితే ఈ సారి మాత్రం స్టోక్స్ చెప్పినా వినేది లేదని యాషెస్ అనంతరం మరోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. పాకిస్థాన్, శ్రీలంక జట్లలోనూ ఇలాంటి ఉందంతాలు ఎన్నో వెలుుగుచూశాయి. తాజాగా మనోజ్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.