‘విరాట్ కోహ్లీ’ ఈ పేరు వినగానే ప్రత్యర్థుల్లో ఒకింత వణుకు, అభిమానుల్లో ఉత్సాహం వచ్చేస్తాయి. పరుగుల యంత్రంగా పేరొందిన విరాట్ కోహ్లీ ఈ మధ్యకాలంలో కాస్త నెమ్మదించాడు. కెప్టెన్‌గా రాణిస్తున్నా.. బ్యాట్స్‌మన్‌గా తనను తాను నిరూపించుకోలేకపోతున్నాడు. అందుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా కారణంగా భావిస్తున్నారు. కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకోకున్నట్లు తెలుస్తోంది. కనీసం టీ20 బాధ్యతలైనా రోహిత్ శర్మకు అప్పగిస్తాడని సమాచారం. ఈ అంశంపై కోహ్లీనే స్వయంగా ప్రకటించనున్నట్లు బీసీసీఐ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి.
కెప్టెన్సీ పరంగా కోహ్లీ(32)కి మంచి రికార్డులే ఉన్నాయి. కోహ్లీ 95 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. అందులో 65 విజయాలు, 27 పరాయజయాలు ఉన్నాయి. ఇక, 45 టీ20లకు కెప్టెన్‌గా చేయగా వాటిలో 27సార్లు విజయం సాధించగా 14సార్లు పరాయజం పాలయ్యారు. మరి, రోహిత్ శర్మ(34) 10 సార్లు వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. 8సార్లు విజయం సాధించి, రెండుసార్లు ఓడిపోయారు. టీ20ల్లో 19సార్లు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించగా.. 15సార్లు విజయం, 4సార్లు పరాజయం పొందారు. ఈ వార్తలే నిజమైతే కోహ్లీకి తన ఫామ్‌పై దృష్టిసారించే అవకాశం దక్కుతుంది. ఫిట్‌నెస్ పరంగా చూసుకుంటే ఇంకో 5, 6 సంవత్సరాలు కోహ్లీ తన కెరీర్‌ను కొనసాగించగలడు.