ఏడాది కాలంగా తనపై వస్తోన్న ట్రోలింగ్ గురుంచి రాహుల్ స్పందించాడు. ఏ ఆటగాడు కూడా కావాలని చెత్త ప్రదర్శన కనబరచడు. క్రికెటే మా జీవితం.. క్రికెట్ తప్ప మాకు మరొకటి తెలియదు. అలాంటప్పుడు కష్టపడటం లేదని ఎలా అనగలరు అంటూ ట్రోలర్లను రాహుల్ ప్రశ్నించాడు.
భారత క్రికెటర్, లక్నో సారథి కేఎల్ రాహుల్‌పై గత ఏడాది కాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి అందరికీ విదితమే. ఇన్నాళ్లు దాని గురుంచి పట్టించుకోని రాహుల్, ఎట్టకేలకు నేడు మౌనం వీడాడు. అందరిలానే తాను ట్రోలింగ్‌కు పట్టించుకోకపోయినా, హద్దులు ధాటిన ట్రోలింగ్ కారణంగా కొన్నిసార్లు బాధపడినట్లు చెప్పుకొచ్చాడు. ‘క్రికెటే మా జీవితం.. మాకు క్రికెట్ తప్ప ఏమీ తెలియదు.. మా జీవితాలు ఇంతే..’ అంటూ ట్రోలర్లపై అసహనం వ్యక్తం చేశాడు.
చాలా రోజులుగా అంతర్జాతీయ స్థాయిలో రాహుల్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అడపా దడపా రాణించినా, కీలక మ్యాచుల్లో విఫలమవుతున్నాడు. ఐపీఎల్ ముందు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టులు ఆడిన రాహుల్.. పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాహుల్‌ను తప్పించి శుభ్‌మాన్ గిల్ కు అవకాశం ఇచ్చారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో పర్వాలేదనిపించినా, అతని స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చాయి. వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నావంటూ విమర్శలు గుప్పించారు. చివరికి గాయంతో టోర్నీకే దూరమయ్యాడు. తర్వాత సర్జరీ చేయించుకోగా, అది విజయవంతమైంది.
KL Rahul reacts to the impact of social media trolls. pic.twitter.com/aCg3D1zriN
— CricTracker (@Cricketracker) May 17, 2023
ఇదిలావుంటే, తాజాగా ‘ది రణ్‌వీర్’ షో కు హాజరైన కేఎల్ రాహుల్‌ను హోస్ట్ ట్రోలింగ్‌పై ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరిలానే తాను ట్రోలింగ్‌కు పట్టించుకోకపోయినా కొన్నిసార్లు బాధపడిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చాడు. “ఆటగాళ్లుగా మేము అభిమానుల మద్దతు కోరుకుంటాం. కానీ వాళ్లే తిడుతూ, ట్రోల్ చేస్తుంటే అస్సలు తట్టుకోలేం.. ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఎవరూ ఆలోచించరు. అతని వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ తిట్టడమే వారి హక్కుగా భావిస్తున్నారు. అది సరైనది కాదు. ఏ ఆటగాడు కూడా కావాలని చెత్త ప్రదర్శన కనబరచడు. క్రికెటే మా జీవితం. క్రికెట్ తప్ప మాకు మరొకటి తెలియదు. కష్టపడటం లేదని ఎలా అనగలరు. కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవచ్చు. నాకు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి..’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.