సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుత క్రీడా ప్రపంచంలో జోరుగా వినిపిస్తోన్నపేరు. బౌలర్ ఎవరనేది skyకి అనవసరం.. అతడికి తెలిసిందల్లా వచ్చిన బాల్ ను వచ్చినట్లు బాదడమే. మెున్న ఆసిస్ తో ఉప్పల్లో సునామీ ఇన్నింగ్స్ ఆడితే.. తాజాగా సౌతాఫ్రికాపై థండర్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా సూర్యకుమార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ సైతం సూర్య బ్యాటింగ్ కు ఫిదా అయ్యాడు. నేను సింగిల్స్ తీయడానికే ఇబ్బంది పడుతుంటే సూర్య వచ్చీరాగానే సిక్స్ లు బాదడం స్టార్ట్ చేశాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
దక్షిణాఫ్రికాతో ప్రారంభం అయిన సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ప్రోటీస్ జట్టును కంగుతినిపించింది. అర్షదీప్, దీపక్ చాహర్ ల అద్భుత బౌలింగ్ తో సౌతాఫ్రికా జట్టు నడ్డివిరిచారు. ఇక ఈ మ్యాచ్ లో తాజా సంచలనం సూర్యకుమార్ యాదవ్ మరో సారి తన బ్యాట్ కు పనిచెప్పాడు. సూర్య కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్ లతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్ తో రాణించిన సూర్యపై టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం కేఎల్ మాట్లాడుతూ..”ఈ మ్యాచ్ లో నేను సింగిల్స్ తీయడానికే ఆపసోపాలు పడుతుంటే సూర్య భాయ్ వచ్చీరాగనే భారీ షాట్లతో అదరగొట్టాడు. అదీ కాక అతడి ఆడిన షాట్లు నమ్మశక్యంగా లేవు. ఇక అతడు ముందే అనుకుని బ్యాటింగ్ కు దిగాడు.. భారీ షాట్లు ఆడాలని, దానికి తగ్గట్లుగానే అతడు తన ప్లాన్ ను అమలు చేశాడు. ఇక ఇది కఠినమైన పిచ్ దీని మీద సింగిల్స్ తీయడమే మాకు కష్టంగా మారింది.
ఈ సమయంలోనే సూర్య భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి సిక్స్ లు బాదడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మ్యాచ్ లో SKY నాకన్నా బాగా ఆడాడు. ఎటాకింగ్ గా ఆడటం ఈ పిచ్ పై చాలా కష్టం.. కానీ సూర్యకి అవన్నీ కనిపించవు. అతడి ఆట అతడిదే” అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక బౌలర్ అర్షదీప్ గురించి మాట్లాడుతూ..”అర్షదీప్ మ్యాచ్ మ్యాచ్ కు మెరుగవుతూ ఉన్నాడు. అతడు మంచి మెంటాలిటీ ఉన్న ఆటగాడు. అర్షదీప్ నైపుణ్యం నేను ఐపీఎల్ లోనే చూశా.. అతడు భారత్ కు దొరికిన అద్భుతమైన బౌలర్. రాబోయే రోజుల్లో అతడు నంబర్ వన్ డెత్ బౌలర్ గా నిలుస్తాడు.. దాంట్లో ఎలాంటి సందేహం లేదు” అని కేఎల్ రాహుల్ అన్నాడు. ఇక సూర్య కుమార్ టీ20 ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే దూకుడు కొనసాగిస్తే.. మరికొన్ని రోజుల్లోనే సూర్యకుమారు నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకోవడం ఖాయమే.