ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇందులో ఒకరు కెవిన్ పీటర్సన్ కాగా, మరొకరు మహేంద్ర సింగ్ ధోని. వాస్తవానికి ఈ వార్ ఒకవైపు నుండే జరుగుతోంది. ధోనీని టార్గెట్ చేసిన పీటర్సన్.. అతనిని ట్రోల్ చేస్తూ వరుస ట్వీట్లు పెడుతున్నాడు.
భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ వరుస ట్వీట్లు పోస్ట్ చేస్తున్నాడు. ఇవి ఫన్నీ ట్వీట్లు అయినా, అవి మహీ గౌరవాన్ని కించపరిచేలా ఉండటంతో భారత అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య తొలిసారి 2017 ఐపీఎల్ సందర్భంగా సరదా ఫైట్ జరిగింది. పీటర్సన్ చేసిన దురుసు వ్యాఖ్యలకు ధోని అదే రీతిలో బదులిస్తాడు. అక్కడితో ఆ వివాదం సద్దుమణిగింది. కానీ, పీటర్సన్ మరోసారి ఆ విషయాన్ని బయటకి లాగి, ధోని చెప్పింది తప్పు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
2017 ఐపీఎల్ సీజన్.. అప్పట్లో ధోనీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఆ సమయంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పీటర్సన్, ఫీల్డింగ్ చేస్తున్న మనోజ్ తివారీతో.. ధోనీ కంటే నేను మంచి గోల్ఫర్ అని కామెంట్ చేస్తాడు. అందుకు ధోనీ బదులిస్తూ.. నువ్వే నా తొలి టెస్ట్ వికెట్ అని సమాధానమిస్తాడు. ఆ వ్యాఖ్యలకు పీటర్సన్ స్పందిస్తూ.. ‘ఔటే కావొచ్చు.. కానీ నేను డీఆర్ఎస్ తీసుకున్నాక అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు..’ అంటూ అప్పట్లో ప్రస్తావించాడు. ఈ విషయాన్ని పీటర్సన్ మరోసారి బయటకి లాగాడు. మంగళ, బుధవారాల్లో వరుస ట్వీట్లు చేసిన పీటర్సన్.. ధోనీపై సరదాగా కౌంటర్లు వేశాడు. ధోనీ తీసిన తొలి టెస్ట్ వికెట్ తనది కాదన్న పీటర్సన్, ఈసారి వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టాడు.
2011లో భారత జట్టు.. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఓ మ్యాచులో ధోనీ బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో పీటర్సన్ క్రీజులో ఉన్నాడు. ఓ బాల్ అతన్ని బీట్ చేసి వికెట్ కీపర్ ద్రవిడ్ చేతుల్లోకి వెళ్తుంది. అందరూ క్యాచ్ ఔట్ కు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిస్తాడు. కానీ కేపీ వెంటనే రివ్యూ చేయడంతో అసలు బంతి.. బ్యాట్ కు తగల్లేదని తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ వీడియోనే కేపీ షేర్ చేస్తూ.. “సాక్ష్యం ఇదే.. ధోనీ తొలి వికెట్ నేను కాదు. అయినా అది మంచి బాల్ ఎంఎస్..” అనే క్యాప్షన్ జతచేశాడు. అంతటితో ఆగాడా! అంటే అదీ లేదు. మరో ట్వీట్ లో నిజానికి తానే ధోనీ వికెట్ తీశానంటూ ఇంకో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ మ్యాచ్ 2007లో ఓవల్ లో జరిగింది. అప్పటికే 92 పరుగులు చేసి సెంచరీకు చేరువవుతున్న ధోనీని పీటర్సన్ క్యాచ్ ఔట్ గా పెవిలియన్ బాట పట్టిస్తాడు. కేపీ చేసిన ఈ ట్వీట్లు నెట్టింట అగ్గి రాజేస్తున్నాయి. ధోని అభిమానులు పీటర్సన్ పై మండిపడుతున్నారు. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలోతెలపండి.
The evidence is CLEAR! I was NOT Dhoni’s first Test wicket.
Nice ball though, MS! 😂😂😂Thanks for sending this through, @SkyCricket 🙏🏽 pic.twitter.com/XFxJOZG4me
— Kevin Pietersen🦏 (@KP24) May 16, 2023
MS Dhoni c Cook b Pietersen pic.twitter.com/UdtXJH37xM
— Kevin Pietersen🦏 (@KP24) May 17, 2023