ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించే ఐపీఎల్‌లో ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు కలలు కంటుంటారు. తమ ప్రతిభ ప్రపంచానికి చాటాలని యువ క్రికెటర్లు, నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని స్టార్ క్రికెటర్లు ఐపీఎల్‌లో అడుగుపెడతారు. ఎవరు ఎన్ని కలలు కన్నా.. ఫ్రాంచైజ్‌ల అవసరాన్ని బట్టి అనమాక ఆటగాళ్లపై కోట్ల కట్టలు కురవచ్చు, భారీ ధర పలుకుతాడని ఆశపెట్టుకున్న ఆటగాళ్లకు అవమానం కూడా ఎదురుకావచ్చు. ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల తలరాతలు మారిపోతాయి. ఎన్ని వ్యాపార కోణాలున్నా.. సగటు క్రికెట్ అభిమానికి మాత్రం రెండున్నర నెలల పాటు ఫుల్ వినోదం అందుతుంది. ఇలా ఐపీఎల్‌ను ఎవరి కోణంలో వారు చూస్తుంటే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మాత్రం ఐపీఎల్‌ను సరికొత్త యాంగిల్ చూస్తూ.. పెద్ద స్కెచ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.
టెస్టు, వన్డే స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఉన్న జో రూట్.. తొలి సారి ఐపీఎల్‌లో ఆడాలని అనుకుంటున్నాడు. అందుకోసం ఐపీఎల్ 2023 మినీ వేలానికి తన పేరును సైతం నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెటర్లు తప్పా.. అంతర్జాతీయ క్రికెటర్లు ఎవరు ఐపీఎల్ ఆడినా.. కేవలం డబ్బు కోసమే అని ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కానీ.. రూట్ మాత్రం తనకు ఎంత తక్కువ ధర వచ్చినా పర్వాలేదు. అసలు ధరతో తనకు సంబంధంలేదు. నేను ఐపీఎల్ ఆడితే చాలు అని అంటున్నారు. ఐపీఎల్‌పై ఇంత సడెన్‌గా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? దాని వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2019 వన్డే వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్‌తో వరుస వరల్డ్ కప్‌లు కొట్టేస్తున్న ఇంగ్లండ్‌కు మరో వరల్డ్ కప్ అందించాలనే లక్ష్యంతోనే రూట్ ఐపీఎల్ ఆడాలని అనుకుంటున్నాడు.
వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఇండియాలో వన్డే వరల్డ్ కప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి-ఏప్రిల్‌లో జరిగే ఐపీఎల్ 2023లో ఆడటం ద్వారా ఇండియాలోని అన్ని పిచ్‌లపై ఆడి.. తన ఆటను ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందని రూట్ ఐపీఎల్ ఆడుదాం అనుకుంటున్నట్లు సమాచారం. మన దేశ పిచ్‌లు, పరిస్థితిలకు, మన బౌలర్లతో పాటు ప్రపంచ టాప్ బౌలర్లను కూడా ఐపీఎల్‌లో ఎదుర్కొనే అవకాశం ఉండటంతో రూట్ ఈ మార్గం ఎంచుకున్నాడు. ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడి.. వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ తరఫున అదరగొట్టాలని రూట్ భావిస్తున్నాడు. ఇలా పెద్ద పథకం ప్రకారమే.. రూట్ ఐపీఎల్ 2023లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూట్ అమ్ముడుపోతాడా? అనేదే అసలు సమస్య. టెస్టు స్పెషలిస్ట్ అయిన రూట్‌ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజ్ కూడా ముందుకు రాదని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. రూట్ ఎన్ని ప్లాన్లు వేసుకున్నా.. వేలంలో భంగపాటు తప్పదని అంటున్నారు.
Joe Root has no expectations on salary – he just wants to experience IPL and could help his game in the ODI World Cup through IPL. (Source – Espn Cricinfo)
— Johns. (@CricCrazyJohns) November 22, 2022
Joe Root has put his name forward for the upcoming IPL Auction 🏏 pic.twitter.com/HqjgjHrMoD
— England’s Barmy Army (@TheBarmyArmy) November 22, 2022