క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకరు. రన్ మెషిన్ గా పేరొందిన కోహ్లీ నుంచి సలహాలు తీసుకోవడాన్ని యువ క్రికెటర్లు ఎంతో అమూల్యమైనదిగా భావిస్తారు. కోహ్లితో ఓ నాలుగు నిమిషాలు ముచ్చటించే అవకాశం వస్తే చాలు అనుకునే యువ క్రీడాకారుల సంఖ్యకు లెక్కేలేదు. భారత మాజీ కెప్టెన్ కూడా అనేక సందర్భాల్లో యువ ఆటగాళ్లతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అలాంటి ఒక సంఘటనను టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ వివరించింది. తాను, స్మృతి మంధాన న్యూజిలాండ్‌లోని ఒక హోటల్‌లో కోహ్లీని ఎలా కలుసుకున్నారో గుర్తు చేసుకున్నారు. నాలుగు గంటల పాటు వారితో సంభాషణ ఎలా సాగిందో కూడా వివరించారు.
2020లో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ లో పర్యటించింది. అదే సమయంలో మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచులకు న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో ఫైనల్ కు చేరిన భారత మహిళల జట్టు ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ బస చేసిన హోటల్లోనే భారత మహిళా క్రికెటర్లకు గదులను కేటాయించారు. దీంతో విరాట్ తో తాము మాట్లాడాలని అనుకున్నామని రోడ్రిగ్స్ తెలిపింది. వెంటనే.. “విరాట్ భయ్యా.. బ్యాటింగ్ కు సంబంధించిన విషయాలను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాం. మేం కూడా మీరుంటున్న ల్లో ఉన్నాం. మిమ్మల్ని కలవొచ్చా?” అని కోహ్లిని రిక్వెస్ట్ చేశామని గుర్తు చేసుకున్నారు. వెంటనే.. కోహ్లీ స్పందించారని..ఎంతో సాదరంగా తమను ఆహ్వానించారని, హోటల్లోని కేప్ కు అనుష్కతో సహా వచ్చారని ది రణవీర్ షోలో రోడ్రిగ్స్ వెల్లడించింది.మాతో మాట్లాడడానికి విరాట్ ఒప్పుకున్నారు కదా.. ఓ నాలుగైదు నిమిషాలు మాట్లాడదామని వెళ్లి దాదాపు నాలుగు గంటలపాటు కోహ్లి – అనుష్కతో ముచ్చటించామని రోడ్రిగ్స్ తెలిపింది. అందులో అరగంట సమయం బ్యాటింగ్ కు సంబంధించిన అంశాల గురించి చర్చిస్తే.. మిగతా సమయమంతా సాధారణ విషయాలే” అని తెలిపింది. అభిమానుల అంచనాలను అందుకోవడానికి పడే ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోవాలో కోహ్లి దగ్గర తెలుసుకున్నామంది. “ఒక్కసారి మైదానంలోకి దిగాక వాటన్నింటినీ పట్టించుకోను.. నా దృష్టంతా ఆటమీదనే ఉంటుంది.. బ్యాటింగ్ కు దిగితే స్కోరు బోర్డు వైపు చూస్తాను.. కానీ ప్రేక్షకుల అరుపులపై దృష్టిపెట్టను. భారత విజయానికి నేనేం చేయగలనో దానినే ఆలోచిస్తా.. ఫలితాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి” అని విరాట్ వివరించారని రోడ్రిగ్స్ తెలిపింది.
ప్రస్తుతం భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. వెస్టిండీస్ తో జరిగిన వార్మప్ మ్యాచులో స్మృతి మంధాన అర్ధ సెంచరీతో రాణించగా.. సోతాఫ్రికాతో జరిగిన మరో మ్యాచులో హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీతో రాణించింది. అయితే.. జెమీమా రోడ్రిగ్స్ కు ప్రస్తుత వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కలేదు. మౌంట్ మాంగనూయ్ వేదికగా మార్చి 4 నుంచి టోర్నీ మొదలు కానుండగా.. మార్చి 6న భారత మహిళల జట్టు పాకిస్తాన్ మహిళల జట్టుతో తలపడనుంది.