సూర్యకుమార్ యాదవ్ సృష్టించిన విధ్వంసంతో చివరి మ్యాచ్‌లో లంకను చిత్తు చేసిన భారత్.. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. గౌహతి వేదికగా మంగళవారం మధ్యాహ్నం తొలి వన్డే ప్రారంభం కానుంది. అయితే.. ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్‌లో యువ బౌలర్లు పర్వాలేదనిపించినా.. అనుభవం లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో పేసర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. జట్టులో అనుభవం కలిగిన ఒక డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బౌలర్ లోటు కనిపించింది. అయితే టీ20ల్లో ఎలాగోలా నెట్టుకొచ్చిన టీమిండియా ఇదే బౌలింగ్ ఎటాక్‌తో వన్డే సిరీస్ కష్టమవుతుందని భావించిన తరుణంలో.. భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వన్డే జట్టుతో చేరుస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ.
ఈ వార్తతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. టీమ్‌లో బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వడంతో జట్టు బౌలింగ్ ఎటాక్ పటిష్టంగా మారుతుందని భావించారు. మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌తో పాటు బుమ్రా సైతం రంగంలో దిగితే.. లంక బ్యాటర్లు తట్టుకోవడం కష్టమే అని భావించారంతా. కానీ.. క్రికెట్ అభిమానుల ఆశలపై నీళ్లు జల్లుతూ.. బుమ్రా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. లంకతో సిరీస్ తర్వాత.. న్యూజిలాండ్‌తో సిరీస్ ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని.. బుమ్రాను ఇప్పుడప్పుడే మైదానంలోకి దింపడం మంచిది కాదని భావించిన బీసీసీఐ.. లంకతో వన్డేకు బుమ్రాను దూరం పెడుతున్నట్లు ప్రకటించింది.
టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా.. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నాడు. ఇలాంటి టైమ్‌లో బుమ్రాను ఆడిస్తే.. మళ్లీ గాయాల బారిన పడే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు సైతం భావిస్తున్నారు. దీంతో లంకతో మూడు వన్డేలో సిరీస్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం కరెక్టే అంటున్నారు. అయితే.. బుమ్రా లేకపోయినా.. షమీ, సిరాజ్‌తో పాటు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌తో టీమ్ పేస్ ఎటాక్ పటిష్టంగానే ఉంది. ఇక ఆల్‌రౌండర్లు కూడా టీమ్‌లో ఉండటంతో జట్టులో బౌలర్ల కొరత లేదనే చెప్పాలి. మరి శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు బుమ్రా దూరం అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jasprit Bumrah will not play in the ODI vs Sri Lanka as BCCI decided not to rush him. (Source – Cricbuzz)
— Johns. (@CricCrazyJohns) January 9, 2023