స్వదేశంలో ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పాల్గొంటాడా అనే ప్రశ్నలకు త్వరలోనే బదులు దొరికేలా ఉంది.
వెన్నెముక గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. వేగంగా కోలుకుంటున్నాడు. గతేడాది సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడిన ఈ స్టార్ పేసర్.. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. 2022 టీ20 ప్రపంచకప్‌తో పాటు పలు కీలక సిరీస్‌లకు బుమ్రా అందుబాటులో లేకుండాపోయాడు. చివరిగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన బుమ్రా.. అనంతరం వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇక అప్పటి నుంచి బుమ్రా పునరాగమనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలోనే గుడ్‌న్యూస్ అందేలా కనిపిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందుతున్న బుమ్రా.. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టి సారించాడు.
భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకోవాలంటే యోయో టెస్టు పాక్ కావడం తప్పనిసరి కావడంతో దానిపై దృష్టి పెట్టిన బుమ్రా.. తన బౌలింగ్‌కు పదును పెంచుకునే పనిలో ఉన్నాడు. ఎన్‌సీఏ అధ్యక్షుడు వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో రోజురోజుకు మెరుగవుతున్న బుమ్రా.. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా చమటోడుస్తున్నాడు. ఈ క్రమంలో నెట్స్‌లో రోజుకు 7 నుంచి 10 ఓవర్ల పాటు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించే సత్తా ఉన్న ఈ స్టార్ పేసర్.. గత స్థాయిలో ఆకట్టుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఎన్‌సీఏ నెట్స్‌లో బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ప్రత్యర్థి జట్లకు ఇక నిద్రలేని రాత్రులే’ అని వ్యక్తి కామెంట్ చేయగా.. ఇంకెన్నాళ్లు బుమ్రా నీ కోసం వేచి చూడాల్సింది అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా గైర్హాజరీలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ.. భారత పేస్ భారాన్ని మోస్తుండగా.. జస్ప్రీత్ తిరిగివస్తే.. భారత బౌలింగ్ బలం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టి.. అదే ఊపులో భారత జట్టులో చోటు దక్కించుకున్న బుమ్రా తొలుత వైట్ బాల్ (పరిమిత ఓవర్ల క్రికెట్)కే పరిమితమయ్యాడు. డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్‌తో పాటు.. అసాధరణ వేగం అతడిని అనతి కాలంలోనే స్టార్‌ను చేశాయి. వన్డే, టీ20ల్లో మ్యాచ్ విన్నర్ అనిపించుకున్న బుమ్రా.. ఆ తర్వాత టెస్టుల్లోనూ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని బుమ్రా.. నిఖార్సైన యార్కర్లతో స్టార్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అయితే భిన్నమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా తరచూ గాయాల బారిన పడుతున్న బుమ్రా.. ఈ సారైనా నిలకడగా జాతీయ జట్టుకు విజయాలు అందిచాలని అభిమానులు కోరుకుంటున్నారు. జాతీయ జట్టు తరఫున 30 టెస్టుల్లో 128 వికెట్లు, 72 వన్డేల్లో 121 వికెట్లు, 60 టీ20ల్లో 70 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఆసియా కప్ వరకు జట్టులోకి పునరాగమనం చేస్తాడని మొదట భావించినా.. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌కు అతడు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Some good news💙 Bumrah getting ready. 🥹🥹 This is so pleasing. #WIvIND #TeamIndia #CricketTwitter pic.twitter.com/Hjv0GLS71E
— Abhi Panchal (@iamabhi1909) July 10, 2023