ఏదో వంకతో ప్రపంచ రికార్డు అని రాసేయడం.. మీకు కొత్తకాదుగా అని చదివేవారికి అనిపించొచ్చు. కానీ, పది దేశాలకు పరిమితమైన ప్రపంచ క్రికెట్ లో ప్రతీది రికార్డే. అవును ఇది జగమెరిగిన సత్యం. ఏమో, ఫుట్ బాల్ క్రీడలా.. 50 దేశాలు ఉండుంటే ఈ రికార్డులు అరుదుగా ఉండేవేమో. ఏదేమైనా.. అరుదైన ఘనత సాధించడమంటే.. ఆషా, మాషీ వ్యవహారం కాదు. ఎంత కష్టపడితే ఆ స్థాయికి చేరుకున్నారో ఆలోంచించడి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటారా! ఇంగ్లాండ్ స్పీడ్ స్టర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే మరెవరికీ సాధ్యంకాని రికార్డును అందుకున్నాడు.
సొంతగడ్డపై 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా జేమ్స్ అండర్సన్ చరిత్రకెక్కాడు. 2002లో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అండర్సన్.. 2003లో జింబాబ్వేతో తొలి టెస్ట్ ఆడాడు. తాజాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుతో స్వదేశంలో 100 టెస్టుల మార్కును అందుకున్నాడు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. సచిన్ సొంతగడ్డపై 94 మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
స్వదేశంలో ఎక్కువ టెస్టులు ఆడిన ఆటగాళ్లు..
19 years after his Test debut at Lord’s, James Anderson has another milestone at home 🏴 pic.twitter.com/kMh7aFSh10
— ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2022
ప్రస్తుతం అండర్సన్ 40 ఏళ్లు. ఒకవైపు వయసు మీద పడుతున్నా తన బౌలింగ్‌లో మాత్రం పదును తగ్గడం లేదు. ఇప్పటివరకు తన 19 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 174 టెస్టులాడిన అండర్సన్ 658 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో శ్రీలంక మణికట్టు మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్(800 వికెట్లు) తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఆసీస్ దివంగత స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.
#OTD in 2020, James Anderson became the first pacer to pick 600 wickets in Test cricket 🐐 pic.twitter.com/VcMpcvXEKT
— CricTracker (@Cricketracker) August 25, 2022
ప్రస్తుతం, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్, 12 పరుగుల తేడాతో పరాజయం పాలైన ఇంగ్లాండ్, రెండో టెస్టును ప్రతీకారం తీర్చుకునే దిశగానే ప్రారంభించింది. తొలి రోజు ఆటలో సౌతాఫ్రికా రెండు సెషన్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. జేమ్స్ అండర్సన్ 3, స్టువర్ట్ బ్రాడ్ 3, బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీశారు.