రీఎంట్రీలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. అందుకు తగ్గట్లే బీసీసీఐ అతడికి ప్రమోషన్ ఇచ్చింది. దీంతో జడేజా జాక్ పాట్ కొట్టేసినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జాక్ పాట్ కొట్టాడు. విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ సరసన చేరాడు. ప్రస్తుతం ఇదే విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కొన్నాళ్ల ముందు వరకు గాయాలతో బాధపడుతున్న జడేజా.. రీఎంట్రీ ఇస్తాడా? ఒకవేళ ఇచ్చినా సరే జట్టులో నిలబడగలడా అని అందరూ అనుకున్నారు. కానీ విమర్శకుల నోళ్లు మూతపడేలా అదరగొట్టేస్తున్నాడు. బ్యాట్, బంతి.. వీటితో పాటు ఫీల్డింగ్ లోనూ కేక పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ బోర్డు ఇతడికి ప్రమోషన్ ఇచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రవీంద్ర జడేజా గురించి టీమిండియా ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీ కెప్టెన్సీలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. అతడి నమ్మకాన్ని సంపాదించాడు. అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులోనే కాదు ఐపీఎల్ లోనూ మెప్పించే ప్రదర్శనలు ఎన్నో చేశాడు. ఇక కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్స్ అయిన తర్వాత జడేజా కొన్ని మ్యాచులు ఫామ్ వల్ల స్థానం కోల్పోయాడు. మరికొన్నిసార్లు గాయాల వల్ల జట్టుకు దూరమయ్యాడు. తాజాగా జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో తనలో ఇంకా స్టామినా తగ్గలేదని ప్రూవ్ చేశాడు. ఆ సిరీస్ లో 22 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్ తాను జట్టులో ఉండి తీరాల్సిందే అనే పరిస్థితి కల్పించాడు.
ఇలా అద్భుతమైన ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రవీంద్ర జడేజాకు బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. వార్షిక కాంట్రాక్టుల జాబితాలో జడేజాను A+ కేటగిరీలో చేర్చింది. ఇందులో ఇప్పటికే కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా ఉండగా.. ఇప్పుడు జడేజా కూడా చేరాడు. వీళ్లు ఏడాదికి రూ.7 కోట్లు చొప్పున అందుకోనున్నారు. హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ A కేటగిరీలోకి వచ్చారు. ఫామ్ కోల్పోయిన పూర్తిగా ఫెయిలవుతున్న కేఎల్ రాహుల్ Bలోకి పడిపోయాడు. అక్టోబరు 2022 నుంచి సెప్టెంబరు 2023 వరకు ఉండే ఈ కాంట్రాక్టులో ఏయే ప్లేయర్సే ఎందులో ఉన్నారో తెలుసా?
A+ కేటగిరీ(రూ.7 కోట్లు): విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
A కేటగిరీ(రూ.5 కోట్లు): హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమి, పంత్
B కేటగిరీ(రూ.3 కోట్లు): పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్
C కేటగిరీ(రూ. కోటి): ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకుర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, కేఎస్ భరత్