భారత సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ జహీర్ ఖాన్ కెరీర్ ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీనే కారణమంటున్నాడు. అయితే ఈ మాటలకు జహీర్ ఖాన్ క్లారిటీ ఇచ్చేసాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ సత్తా చాటుతాడు. ప్రపంచంలోనే అత్యున్నత ఫిట్ నెస్ కలిగిన క్రికెటర్లలో విరాట్ ఒకడు. ఫీల్డ్ లో ఎంతో చురుగ్గా ఉండే కోహ్లీ.. బంతి తన దగ్గరికి వస్తే తన అత్యుత్తమ ఎఫర్ట్ ఇస్తాడు. అయితే కొన్ని సార్లు దురదృష్టం కొద్ది చేతిలోకి వచ్చిన క్యాచులు కూడా మిస్ అవుతాయి. కోహ్లీ క్యాచ్ మిస్ చేయడం వలన టీమిండియా ఆ టెస్టు మ్యాచులో పట్టు కోల్పోవడంతో పాటుగా భారత మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్ కెరీర్ ముగియడానికి కారణమయ్యాడు. అదేంటి అలా ఎలా సాధ్యం? అనుకుంటున్నారా. భారత బౌలర్ ఇషాంత్ శర్మ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి జహీర్ ఖాన్ క్రికెట్ కి వీడ్కోలు పలకడానికి, కోహ్లీ క్యాచ్ మిస్ చేయడానికి సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం.
భారత్ వెస్టిండీస్ ల మధ్య డొమినికా వేదికగా జరిగిన రెండో టెస్టులో సిరాజ్ బౌలింగ్ లో కోహ్లీ ఒక సింపుల్ క్యాచ్ ని మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కామెంట్రీ చేస్తున్న ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ 2014 లో న్యూజీలాండ్ మీద జరిగిన టెస్టు మ్యాచుని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇషాంత్ శర్మ మాట్లాడుతూ ” కోహ్లీ వల్లే నా కెరీర్ ముగిసిందని నాకు జహీర్ ఖాన్ చెప్పాడు. మెక్కలం 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు జహీర్ ఖాన్ బౌలింగ్ లో కోహ్లీ సింపుల్ క్యాచ్ ని మిస్ చేసాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న మెక్కలం ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. ఈ మ్యాచ్ లంచ్ సమయంలో కోహ్లీ జహీర్ వద్దకు వచ్చి సారీ చెప్పాడు. దానికి జహీర్ బదులిస్తూ ఏం పర్లేదు అని కోహ్లీకి ధైర్యం చెప్పాడు. టీ విరామ సమయంలో కోహ్లీ మరోసారి జహీర్ వద్దకు వచ్చి సారీ చెప్పాడు. దీంతో జహీర్ నీ వల్లే నా కేరీ ముగిసిపోనుందని చెప్పాడు” అని ఇషాంత్ వ్యాఖ్యానించాడు.
అయితే ఈ వ్యాఖ్యల్లో నిజం లేదని.. కొహ్లిని నేను అలా అనలేదని జహీర్ క్లారిటీ ఇచ్చేసాడు. “నీ వల్లే నా కెరీర్ ఎండ్ అయిందని నేను కోహ్లీని అనలేదు. ఇశాంత్ నా మాటలను వక్రీకరించాడు. ఇప్పటివరకు టీమిండియా ఆటగాళ్లలో మూడొందల పరుగులు చేసిన ఆటగాడి క్యాచులను మిస్ చేసిన ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. మొదట వికెట్ కీపర్ కిరణ్ మోరే క్యాచ్ మిస్ చేయడంతో ఇంగ్లాండ్ ఆటగాడు గ్రాహం గూచ్ ట్రిపుల్ సెంచరీ చేసాడు. ఆ తర్వాత మెక్కలం 9 పరుగుల వద్ద కోహ్లీ క్యాచ్ మిస్ చేయడంతో ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. నేను ఆ రోజు కోహ్లీతో జోక్ గా నీ వల్లే నా కెరీర్ ఎండ్ అవుతుందని చెప్పాను. కానీ కోహ్లీ మాత్రం ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొని బాధపడిపోయాడు. దీంతో నేను పర్లేదు ఏ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అని కోహ్లీతో చెప్పాను”. అని జహీర్ ఖాన్ తెలిపాడు. మొత్తానికి జహీర్ సరదాగా చెప్పిన మాట ఇశాంత్ మరో రకంగా చెప్పడంతో కాసేపు వీరి మాటలు కాస్త వైరల్ గా మారాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.