శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు వైరల్ అవుతోంది. ఎన్నో అపవాదులు, మరెన్నో అవమానాల తర్వాత తానేంటో తెలియజేశాడు. అసలు టీ20 క్రికెట్ కే పనికిరాడు అన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు. టీ20ల్లో కూడా శతకం చేశాడు. సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో శుభ్ మన్ గిల్ అద్భుతమైన ఫామ్ కనబరచడం, వరుస శతకాలు నమోదు చేయడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే గిల్ బయట ఎంత ఫన్నీగా ఉంటాడో చాలా మందికి తెలియదు. అతను ఎంత ఫన్నీగా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది.
చాహల్- ఇషాన్ కిషన్– శుభ్‌మన్ గిల్ ఒక రూమ్ లో ఉన్నారు. ఇంక చాహల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే. అయితే ఈసారి అతను ఎంతో సైలెంట్ గా ఉండి.. కుర్రాళ్లతో ఫన్ క్రియేట్ చేయించాడు. వారు రోడీస్ కి సంబంధించిన ఆడిషన్స్ సీన్ ని రీక్రియేట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో శుభ్ మన్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేశాడు. రోడీస్ రీలోడెడ్.. మాకు ఇష్టమైన సందర్భాన్ని మేము ఈ విధంగా రీక్రియేట్ చేశాం అంటూ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోలో.. చాహల్ ఒక జడ్జి స్థానంలో కూర్చుని ఉండగా.. శుభ్ మన్ గిల్ కంటెస్ట్ స్థానంలో ఉన్నాడు. ఇషాన్ కిషన్ మరో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. ఇంటెన్సిటీ, ప్యాషన్ ఉండాలంటూ ఇషాన్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. అందుకు శుభ్ మన్ గిల్ నాలో ఇంటెన్సిటీ, ప్యాషన్ ఉన్నాయి. నేను కచ్చితంగా చేస్తానంటూ ఏడుస్తుంటాడు. అప్పుడు ఇషాన్ కిషన్ ఒక కోపంతో ఊగిపోయే గొరిల్లాలా గంతులు వేస్తాడు. నువ్వు ఆంగ్రీ గొరిల్లాని చూశావా? చెంపదెప్ప కొట్టుకో అనగానే శుభ్ మన్ గిల్ కొట్టుకుంటాడు. వెంటనే ఇషాన్ కూడా చెంపదెబ్బ కొడతాడు బెటర్ అంటూ వెళ్లిపోతాడు. వీళ్లు చేసిన ఈ రీల్ కి 7.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అభిమానులు అంతా వారి యాక్టింగ్ స్కిల్స్ కి ఫిదా అయిపోతున్నారు.